What Next After Ram Mandir Pran Pratishta :దశాబ్దాల కల నెరవేరింది. అయోధ్యలో శ్రీరాముడికి అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ట జరిగింది. దేశంలోని ప్రముఖులంతా ఈ వేడుకకు విచ్చేసి బాలరాముడిని కనులారా వీక్షించారు. మరి తర్వాత ఏం జరగనుంది? అయోధ్య రాముడి దర్శనానికి సాధారణ ప్రజలు ఎప్పటి నుంచి వెళ్లొచ్చు? బాలరాముడికి పూజలు చేసేది ఎవరు? ప్రసాదం ఏమిస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు మీకోసం.
అయోధ్యకు ఎప్పటి నుంచి వెళ్లొచ్చు?
ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాతి రోజు నుంచే అంటే జనవరి 23 (మంగళవారం) నుంచే అయోధ్య రామ మందిరం సాధారణ భక్తులను అనుమతించనున్నారు. ఉదయం 8 నుంచి ఒంటిగంట మధ్య, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల మధ్య రాముడిని దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 4.30కి జాగరణ్/శృంగార హారతి, రాత్రి 7 గంటలకు సంధ్యా హారతి ఉంటుంది.
హారతి సమయంలోనూ దర్శనానికి వెళ్లొచ్చా?
హారతికి హాజరుకావాలనుకునే భక్తులకు ఉచితంగా పాసులు అందిస్తున్నారు. ఆఫ్లైన్, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా పాసులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి పాసులు తీసుకోవచ్చు.
పూజలు ఎవరు చేస్తారు?
ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆధ్వర్యంలో పూజలు జరుగుతాయి. ఇప్పటికే ప్రత్యేక నియామకం ద్వారా 29 మంది పూజారులను ఎంపిక చేశారు. పూజారుల ఎంపిక కోసం కఠినమైన ప్రక్రియ అనుసరించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 3వేల దరఖాస్తులను పరిశీలించి 200 మందిని తొలుత ఎంపిక చేశారు. వారికి 6 నెలలు కఠినమైన శిక్షణ ఇచ్చి, పరీక్షించి 29 మందిని సెలెక్ట్ చేశారు.
ప్రసాదంగా ఏమిస్తారు?
ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా లడ్డూ ప్రసాదాలు అయోధ్యకు వచ్చాయి. ఆలయాల నుంచి విరాళాలుగా వేల లడ్డూలు వచ్చాయి. వీటిని ఆహ్వానితులకు, భక్తులకు పంపిణీ చేసే అవకాశం ఉంది. ప్రాణప్రతిష్ఠకు వచ్చిన అతిథులకు దేశీయ నెయ్యితో వండిన ఆహారాన్ని మహాప్రసాదంగా వడ్డించారు. గెస్టులకు ఒక బాక్సులో 7 రకాల ప్రసాదాలు పెట్టి అందజేయనున్నట్లు కమిటీ వెల్లడించింది. నేతితో చేసిన రెండు లడ్డూలు, బెల్లం రేవ్‌డీ, రామదాన చిక్కీ, అక్షతలు, కుంకుమ, తులసీదళం, యాలకులతో పాటు రాముడి దీపం ప్రమిద బాక్సులో ఉంటాయి. వాటిని ఓ ప్రత్యేక సంచిలో పెట్టి ప్రముఖులకు అందజేయనున్నారు.