Serial Killer Murders In Telangana : అతడో నరరూప రాక్షసుడు. తన వైకల్యాన్ని అవకాశంగా మలచుకొని దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలకు తెగబడ్డాడు. జైలు నుంచి విడుదలైన 11 రోజుల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో 5 హత్యలకు పాల్పడినట్టు గుజరాత్ పోలీసులు నిర్దారించారు. హర్యానాకు చెందిన రాహుల్ జాట్ (29) అరాచకానికి యాదగిరిగుట్ట రైల్వేస్టేషన్‌లో తెలుగు మహిళ రమణమ్మ బలయ్యారు. ఆమెను హత్య చేసి సొంత రాష్ట్రం పారిపోయే క్రమంలో గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఇతడి అఘాయిత్యాలు వెలుగుచూశాయి. కర్ణాటక, పశ్చిమబెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రైల్వేస్టేషన్లలో ఐదుకు పైగా హత్యలకు పాల్పడినట్టు గుర్తించారు.
నైలాన్ తాడు మూడంగులాల కత్తి. రెండు నెలలు ఐదు హత్యలు. చెప్పాలంటే రాహుల్ జాట్ ఒక సైకో కిల్లర్. అసలు పేరు భోలు కర్మవీర్ ఈశ్వర్‌జాట్. హర్యానా రాష్ట్రానికి చెందిన ఇతడికి ఐదోఏట పోలియో బారినపడటంతో ఎడమకాలికి వైకల్యం ఏర్పడింది. చదువు అబ్బకపోవటంతో కూలీపనులు చేస్తుండేవాడు. 2018-19లో ట్రక్ దొంగతనం, అక్రమ ఆయుధాల రవాణాపై రాజస్తాన్, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ కేసులో జోద్‌పూర్ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
అత్యాచారానికి పాల్పడి హత్య : జైలు నుంచి విడుదలయ్యాక ఈ నెల 14న గతంలో పనిచేసిన హోటల్‌లో జీతం తెచ్చుకునేందుకు లోకల్ రైలులో ఉద్వాడ చేరాడు. ఉద్వాడ రైల్వేస్టేషన్ దిగిన రాహుల్ రైల్వేట్రాక్ పక్కన నడుచుకుంటూ వెళుతున్న యువతిని చూశాడు. బీకామ్ చదువుతున్న ఆ యువతి ఫోన్ మాట్లాడుతూ వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన మృగాన్ని గమనించలేకపోయింది. తేరుకునేలోపుగానే అతడు యువతి గొంతుకు తాడు బిగించి, పక్కనే ఉన్న మామిడి తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఆ తర్వాత సమీపంలోని దుకాణానికి వెళ్లి పాలు, నీళ్ల సీసాలు కొనుక్కొని వచ్చి మళ్లీ మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ లోపు అలికిడి కావడంతో తన సంచి అక్కడే వదిలేసి పారిపోయాడు.
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మృతదేహం సమీపంలో సంచిని స్వాధీనం చేసుకున్నారు. దానిలో దుస్తులు, ఒక నైలాన్ తాడు, కత్తిని గుర్తించారు. వాటి ఆధారంగా నిందితుడు రైళ్లలో ప్రయణిస్తున్నట్టు అంచనాకు వచ్చారు. చుట్టుపక్కల రైల్వేస్టేషన్లలోని 5వేల సీసీటీవీ కెమెరాలు జల్లెడ పట్టారు. చివరకు ఉద్వాడ రైల్వేస్టేషన్‌లో కుంటుకుంటూ వెళుతున్న వ్యక్తి వెనుక తగిలించుకున్న సంచి, మృతదేహం వద్ద దొరికిన సంచి ఒకేలా ఉండటంతో అనుమానితుడి ఫోటోను రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లకు పంపారు. చివరకు సూరత్‌లోని లాజ్‌పురా జైలు అధికారులు అతడు గతంలో తమ దగ్గర శిక్ష అనుభవించిన రాహుల్‌గా గుర్తించారు. అదే సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడంతో నిందితుడు ఎవరన్నది తేలింది.
తెలంగాణాలోనూ హత్య : ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన రమణమ్మ కుటుంబం ఉపాధి కోసం కర్ణాటకలో ఉంటోంది. హైదరాబాద్‌లో ఉన్న పెద్దకూతురుని చూసేందుకు బయల్దేరిన ఆమెను కుమారుడు తోర్నగల్ రైల్వేస్టేషన్‌లో ఈ నెల 23న రాత్రి బెల్గావి-మణగూరు ఎక్స్‌ప్రెస్ ఎక్కించాడు. మరుసటి రోజు ఉదయం ఆమెను తీసుకెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లమంటూ బావ వెంకటేశ్‌కు సమాచారం ఇచ్చాడు. 24 ఉదయాన్నే అత్తను తీసుకొచ్చేందుకు వెళ్లిన వెంకటేశ్ దివ్యాంగుల కోచ్‌లో రమణమ్మ మరణించి ఉండటం గమనించాడు.
ఆమె సెల్‌పోన్, రూ.25వేలు నగదు మాయమైనట్టు గుర్తించారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాదగిరి రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెను టవల్‌తో గొంతు నులిమి హతమార్చినట్టు గుర్తించారు. మృతురాలి సెల్‌ఫోన్ బెంగళూర్‌లో స్విచ్చాఫ్ చేసినట్టు నిర్దారించారు. రమణమ్మను హతమార్చిన రాహుల్ కర్ణాటక చేరాడు. అక్కడ నుంచి గుజరాత్‌లోని వాపి రైల్వేస్టేషన్ చేరాడు. అప్పటికే లాజ్‌పురా జైలు అధికారులు ఇచ్చిన సమాచారంతో రాహుల్ జాట్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్కడి పోలీసులు సీసీటీవీ కెమెరాల్లో ప్లాట్‌ఫామ్‌పై కుంటుతూ నడుస్తున్న రాహుల్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు : అతడి వద్ద రమణమ్మ మొబైల్ ఫోన్, రైలు టిక్కెట్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో మణగూరు ఎక్స్‌ప్రెస్‌లో మహిళ హత్యతో పాటు వరుస దారుణాలు బయటపెట్టడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రమణమ్మ హత్య కేసులో రాహుల్‌ను పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి తీసుకొచ్చేందుకు ఈ నెల 29న సికింద్రాబాద్ రైల్వేపోలీసులు గుజరాత్ వెళ్లనున్నారు. నిందితుడి కస్టడీకి తీసుకొని విచారిస్తే రమణమ్మ హత్య గురించి పూర్తివివరాలు బయటపడతాయని రైల్వే పోలీసులు వివరించారు.
ఒంటరి మహిళలే ఆ 'సీరియల్ కిల్లర్' టార్గెట్ - కనిపిస్తే దోపిడీ, హత్య - చివరకు?
Mylardevpalli Double Murder Case Update : చిల్లర డబ్బుల కోసం 8 మంది ప్రాణాలు తీశాడు..