Tourists Can Visit Siachen : హిమాలయాల్లోని యుద్ధక్షేత్రాల సందర్శనకు సంబంధించి భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కార్గిల్, సియాచిన్ గ్లేసియర్, గల్వాన్ లాంటి యుద్ధ క్షేత్రాల్లో పర్యటకులకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు.
"జమ్మూకశ్మీర్‌లో పర్యటక రంగ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయి. కొంత కాలంగా సందర్శకుల పెరుగుదల భారీగా కనిపిస్తోంది. అందుకే పర్యట రంగాన్ని మరింత ప్రోత్సహించాలని నిర్ణయించాం. ఇందుకోసం 48 ప్రాంతాలను గుర్తించాం. వచ్చే 5 ఏళ్లలో పర్యటకుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది" అని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ద్వివేది వెల్లడించారు.
పుణె యూనివర్సిటీలో ‘భారత్ వృద్ధి పయనంలో ఇండియన్ ఆర్మీ పాత్ర’ అంశంపై జనరల్ ద్వివేది ప్రత్యేకంగా ప్రసంగించారు. సరిహద్దు ప్రాంతాల్లో పర్యటకులు సాహస కార్యకలాపాలు చేయడాన్ని ఆర్మీ ప్రోత్సహిస్తుందని, ఇందుకోసం టూర్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తుందని తెలిపారు. కార్గిల్, గల్వాన్ లాంటి యుద్ధక్షేత్రాలను చూసేందుకు పర్యటకులకు అనుమతి ఇస్తామని తెలిపారు.
లద్ధాఖ్‌లోని కారాకోరం పర్వత శ్రేణుల్లో ఉన్న సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఇక్కడ సేవలందించడం సైన్యానికి సవాల్‌తో కూడుకున్న పని. లద్దాఖ్‌లోనే ఉన్న కార్గిల్‌లో 1999లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. గల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య 2020 జూన్‌లో చోటుచేసుకున్న ఘర్షణల్లో అనేక మంది అమరులైన విషయం తెలిసిందే.