Legal Advice For Family Problem : మొదట ప్రేమిస్తున్నానంటూ వెంటపడతారు కొద్దిమంది యువకులు.పెళ్లి చేసుకుని.. జీవితాంతం తోడుంటానని నమ్మకం కలిగిస్తారు. పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత అందంగా లేవు, లావైపోయావని దూరం పెడుతుంటారు. దీంతో ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలోకి వెళుతుంటారు అమ్మాయిలు. అచ్చం ఇలాంటి పరిస్థితే ఓ మహిళకు ఎదురైంది. ఇంతకీ ఆమె సమస్య ఏంటి? దానికి న్యాయ నిపుణులు ఎటువంటి సలహా ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం.
ఇదీ సమస్య..
'మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాకు ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజుల తర్వాతే తెలిసింది అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని. లావుగా ఉన్నానని నన్ను దూరం పెడుతున్నాడు. గట్టిగా అడిగితే డివోర్స్ ఇస్తానని బెదిరిస్తున్నాడు. పెళ్లికాలేదని చెబుతూ ఆడపిల్లలతో కలిసి తిరుగుతున్నాడు. ఆ విషయాన్ని వారికి తెలిసేలా చేస్తే.. నాకు పిచ్చి ఉందని చెప్పి వాళ్ల సానుభూతి పొందుతున్నాడు. మా అత్తమామలు.. నేను సరిగా కాపురం చేయకే తనలా తయారయ్యాడని నాపైనే నిందలేస్తున్నారు. దీంతో పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదు' అని ఆందోళన చెందుతూ న్యాయ నిపుణుల సహాయం కోరుతోంది ఆ మహిళ . ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది 'జి. వరలక్ష్మి' ఎలాంటి సమాధానం ఇచ్చారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..
"ప్రేమ గుడ్డిది అని చెప్పడానికి ఇలాంటి సంఘటనలే ఒక ఉదాహరణ. ప్రేమించే ముందు అతడి గురించి ఏమీ తెలుసుకోలేదా? కుటుంబం, ఉద్యోగం, అలవాట్లు.. వంటివి ఏమీ గమనించుకోలేకపోవడమే మీ పరిస్థితికి ప్రధాన కారణం. నేటి కాలంలో సినిమా డైలాగులు చెప్పి చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ, ఆ బంధాన్ని మాత్రం చివరి వరకూ నిలుపుకోవడం లేదు.
"మీ భర్తకి అమ్మాయిల వ్యసనం ఉందని చెబుతున్నారు. అందుకోసం మిమ్మల్ని పిచ్చిదానిగా నిరూపించడానికి ట్రై చేస్తున్నాడనీ అంటున్నారు. ఇదంతా మానసికంగా హింసించడం కిందికే వస్తుంది. ఒకవేళ మీరు డివోర్స్ కావాలనుకుంటే క్రూరత్వాన్ని కారణంగా చూపించి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం విడాకులకి అప్లై చేయొచ్చు. లేదూ భర్తతోనే కలిసి ఉండాలనుకుంటే గృహహింస చట్టం కింద ప్రొటెక్షన్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయండి. వారు డీవీసీ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారం మీ ఫిర్యాదు చెక్ చేసి కోర్టుకు పంపిస్తే మీకు తగిన సాయం అందుతుంది."- జి. వరలక్ష్మి, న్యాయవాది
మీకు రక్షణ కల్పించమని(సెక్షన్ 18), ఇంట్లో నివసించే హక్కు(సెక్షన్ 19), పిల్లలకూ మీకూ జీవనభృతి (సెక్షన్ 20), పిల్లల కస్టడీ(సెక్షన్ 21), ఇన్నాళ్లూ మీరు పడ్డ మానసిక వేదనకు పరిహారం(సెక్షన్ 22) కోరవచ్చు. ఇవన్నీ కాదు.. అతడికి కౌన్సెలింగ్ అవసరం అనుకుంటే ఫ్యామిలీ కౌన్సెలర్ దగ్గరకో, లీగల్ సర్వీసెస్ అథారిటీకో తీసుకువెళ్లండి. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, భవిష్యత్తులో ఇతర అవసరాలకోసం అతడు ఏమైనా ఇవ్వగలడా? వారి రక్షణ కోసం తండ్రిగా ఏం చేయగలడు? వంటివన్నింటికీ కౌన్సెలింగ్ సెంటర్‌లోనే పరిష్కారం లభిస్తే.. మీరు డివోర్స్ తీసుకున్నా ఫరవాలేదు. గడప దాటనంత సేపు మీ ప్రాబ్లమ్ ఓ కొలిక్కి రాదు. అయితే, ఏ నిర్ణయమైనా మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని తీసుకోండి" అని సలహా ఇస్తున్నారు ప్రముఖ న్యాయవాది వరలక్ష్మి.
Note: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. న్యాయవాదుల సలహాలు, చట్ట ప్రకారం పాటించాల్సిన సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత న్యాయవాది సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
ఆడపిల్లలకు తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఉండదా? - న్యాయ నిపుణుల సమాధానమిదే!
'నా నగలు వీళ్లు తాకట్టు పెట్టారు - వాటిని మా పుట్టింటి వాళ్లు విడిపించాలట!' - ఏం చేయాలి?