17 Accused Sentenced To Life Imprisonment In Murder Case : ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండలోని ఎస్సీ,ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి రోజా రమణి తీర్పు వెల్లడించారు. కోర్టు తీర్పుపై మృతిని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే,
అసలేం జరిగింది : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అజీంపేట గ్రామంలో 2017 సంవత్సరంలో బట్ట లింగయ్య హత్య జరిగింది. లింగయ్య గతంలో అదే గ్రామానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి మరణానికి కారణమై బెయిలు మీద బయటకు వచ్చాడు. ఈ కారణంతో బట్ట లింగయ్య అతని కుటుంబ సభ్యులు, తోటి కులస్తులు పగ పెంచుకున్నారు. దసరా పండుగ సందర్భంగా జరిగే ఉత్సవాల్లో బట్ట లింగయ్య కుటుంబంతో సహా పాల్గొనడానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గతంలో తన వల్ల చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఎదురుకాగా వారు ఉద్రేకానికి లోనై, దుర్భాషలాడుతూ విచక్షణ రహితంగా, సామూహికంగా భౌతిక దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన బట్ట లింగయ్య మృతి చెందాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై U/S,147, 302, 323 504 R/W 149 &109 IPC & సెక్షన్ 3(1)(r)(s),3(2)(va) ఎస్సీ ఎస్టీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఎస్.రమేష్ అప్పుడు ఏసీపీ హోదాలో ఈ కేసు విచారణను చేపట్టారు. కేసు విచారణ అనంతరం హత్య కేసులో అప్పటి సర్పంచ్ లింగయ్యతో పాటు ఓ మహిళ సహా 18 మంది నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అనంతరం 18 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో వాయిదాలు నడుస్తున్న సమయంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అఖిల వాదనలు వినిపించారు. సాక్ష్యాదారాల పరిశీలన అనంతరం నల్గొండలోని ఎస్సీ,ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు ఈ కేసులో 17 మంది నిందితులు ఒక్కొక్కరికి జీవిత ఖైదు శిక్ష, రూ.6000/- జరిమానా విధించింది.

"యాదవులకు చెందిన ఓ వ్యక్తి మరణానికి మేము కారణమని నా భర్తను మా కుటుంబ సభ్యులు ముందు దారుణంగా కొట్టి చంపారు. చేయని నేరానికి ఐదు సంత్సరాలు జైల్లో ఉన్నాం. వాళ్లకు జీవిత ఖైదు శిక్ష వేయడం ఆనందంగా ఉంది."- మృతుడు బట్ట లింగయ్య భార్య
"మాకు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద లేనిది మేము బతకలేదు. ఎలా జీవించాలో అర్థం కావటం లేదు."- నిందితుల కుటుంబ సభ్యులు
ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ, తాత్కాలిక ఆవేశంలో విచక్షణను మరిచి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేవారు తగిన శిక్షను అనుభవించాల్సి వస్తుందని, తమ చక్కటి భవిష్యత్తును కోల్పోయి జైలు జీవితం గడపాల్సి వస్తుందని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యక్తులు తాత్కాలిక ఆవేశాలకు లోనుకాకూడదని, కులతత్వాన్ని విడనాడాలని, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని సూచించారు.