Railways ALP Recruitment : ఇండియన్ రైల్వే 18,799 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం ఏకంగా 22.5 లక్షల మంది అభ్యర్థులకు, 346 సెంటర్లలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తోంది. సోమవారం నాడు ప్రారంభమైన ఈ పరీక్షలు శుక్రవారం వరకు కొనసాగనున్నాయి. మొత్తం 15 షిఫ్ట్‌ల్లో, 18 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుంది.
'ఇప్పటికే 13.5 లక్షల మంది అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్ష రాశారు. మరో 9 లక్షల మంది గురు, శుక్రవారాల్లో పరీక్ష రాయనున్నారు' అని ఓ సీనియర్ రైల్వే బోర్డ్ అధికారి తెలిపారు.
RRB Exam Calendar
- రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) ఏటా అనేక రకాల పోస్టుల భర్తీ కోసం పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ పరీక్షలను పర్యవేక్షించేందుకు రైల్వే భవన్లో ఒక కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. దీనిలో అన్ని ఎగ్జామ్ సెంటర్స్‌లో జరిగే పరీక్షలను నేరుగా సీసీటీవీ కెమెరాల ద్వారా అధికారులు పర్యవేక్షిస్తుంటారు.
- ఈ ఏడాది ఫిబ్రవరిలో రైల్వే బోర్డ్ మొదటిసారిగా వార్షిక ఉద్యోగ నియామక క్యాలెండర్ (యాన్యువల్ ఎగ్జామ్ క్యాలెండర్)ను విడుదల చేసింది. ఇకపై దీనిలో పేర్కొన్న షెడ్యుల్ ప్రకారమే, ఉద్యోగ నియామకాలు జరుగుతాయి.
- రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇకపై ఏటా జనవరి, మార్చి నెలల మధ్య అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.
- ఏప్రిల్, మే, జూన్ నెలల్లో టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తుంది.
- జులై నుంచి సెప్టెంబర్ మధ్య జూనియర్ ఇంజినీర్స్, పారామెడిక్స్, నాన్-టెక్నికల్ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల అవుతాయి.
- అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య లెవల్-1, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల అవుతాయి.
"ఒకప్పుడు రైల్వే పరీక్షలు ఎప్పుడవుతాయో తెలిసేది కాదు. మూడు, నాలుగు సంవత్సరాలకు ఒకసారి పరీక్షలు జరిగేవి. దీని వల్ల చాలా మంది అభ్యర్థులకు ఏజ్ బార్ అయిపోయేది. ఇకపై ఇలాంటి సమస్య రాదు. ఇకపై ఆర్ఆర్బీ ఏటా 4 సార్లు వివిధ కేటగిరీల ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటనలు జారీ చేస్తుంది. దీని వల్ల ఎక్కువ మంది రైల్వే పరీక్షలు రాయడానికి వీలవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు ఒక అభ్యర్థి అప్లై చేశాడని అనుకుందాం. ఒక వేళ అతను దీనికి క్వాలిఫై కాకపోతే, మళ్లీ వచ్చే ఏడాది పరీక్షకు సిద్ధం కావచ్చు. ఒకవేళ అతనికి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటే, ఇదే ఏడాదిలో టెక్నికల్ ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవచ్చు" అని సదరు రైల్వే అధికారి తెలిపారు.