Hyderabad Traffic Signal Cases : ఏడాది కిందటి వరకు హెల్మెట్ ధరించే ద్విచక్ర వాహనదారుల సంఖ్య 80 శాతం వరకు ఉండేది. కొన్ని నెలలుగా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇది సగానికి పడిపోయింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్‌లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఖరీదైన బైకులు కొనే విషయంలో ఉన్న శ్రద్ధ బాధ్యతగా డ్రైవింగ్ చేయడంలో మాత్రం చూపించడం లేదు. చాలామంది వాహనదారులు హెల్మెట్లు వాడకపోగా ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించడం లేదు. రెడ్ సిగ్నల్ పడినా వేగంగా దూసుకుపోతుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా వరకు కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు కనిపించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.
హైదరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. ఏఏ ప్రాంతాల్లో ఎంత వేగంతో ప్రయాణించాలని పోలీసులు సూచించినా వాహనదారులు పెడచెవిన పెట్టేస్తున్నారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ పోలీసులు ఒక్కరో, ఇద్దరో కనిపిస్తున్నా ప్రేక్షక పాత్రే పోషిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
- హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా 2,500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు.
- మహానగరంలో ఈ ఏడాది అక్టోబరు నాటికి వాహనాల సంఖ్య 80 లక్షలకు చేరగా నిత్యం 50 లక్షల వాహనాలు రోడ్డుపైనే తిరుగుతున్నాయి.
- నగరంలో సుమారు 335 సిగ్నళ్లు ఉండగా ఇందులో 20 శాతం అంటే 65 నుంచి 70 సిగ్నళ్లు సరిగా పని చేయడం లేదు.
కనిపించని ట్రాఫిక్ పోలీసులు : ప్రతి సిగ్నల్ దగ్గర ఇద్దరు, ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వారిని అడ్డుకుంటే ట్రాఫిక్ సైతం నియంత్రణలో ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో సుమారు 3 వేల మందికి పైగా ట్రాఫిక్ పోలీసులున్నా క్షేత్రస్థాయిలో వారిలో సగం కూడా కనిపించడం లేదు. అలాంటి చోట్ల రెడ్‌సిగ్నల్ పడినా వాహనదారులు నిబంధనలను అతిక్రమిస్తున్నారు. పోలీసులు రాత్రి ఏడు గంటల తరువాత విధులు ముగించుకొని వెళ్లిపోతున్నారు. గచ్చిబౌలితో, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్ బ్రిడ్జి కింద ఉన్న ముఖ్యమైన సిగ్నళ్ల దగ్గరా ఇదే పరిస్థితి. రాత్రి 11 నుంచి మొదలుకొని ఉదయం 6 గంటల వరకు వాహనదారులదే ఇష్టారాజ్యం.
ట్రాఫిక్ నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొన్ని మార్పులు చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పోలీసులు ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సిగ్నల్ వ్యవస్థను ఆధునీకరించడానికి ప్రయత్నిస్తున్నాం. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ పోలీసుల పనితీరులో తప్పకుండా మార్పు కనిపిస్తుంది -సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
సిగ్నల్ జంపింగ్ కేసులు (గత పది నెలల్లో)
- హైదరాబాద్ 2 లక్షల 66 వేలు
- సైబరాబాద్ 75 వేలు
- రాచకొండ 54 వేలు
వీడెవడండీ బాబు - బైక్ ఆపిన ట్రాఫిక్ పోలీస్ బాడీ కెమెరానే కొట్టేశాడు!
ఈసారి చెట్లపై 'హైడ్రా' ఫోకస్ - ఇక హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ సమస్యకు చెక్?