Young Men Harassing Women For Refusing To Marry : ఓ జంటకు పెళ్లి సంబంధం కుదిరింది. ఒకరి ఫోన్ నంబర్ ఒకరు తీసుకున్నారు. యువతికి ఫోన్ చేసినప్పుడు ఎంగేజ్ వస్తే అనుమానించేవాడు. ఈ విషయాన్ని యువతి ఇంట్లో చెప్పడంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. దీన్ని అనుమానంగా భావించిన అతడు వాట్సాప్ గ్రూపుల్లో ఆమె గురించి అసభ్యకరంగా పోస్టులు పెడుతూ విషప్రచరాం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
- అమ్మాయి బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తోంది. అమెరికా సంబంధమని ఆశపడి పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. అంతా సరే అనుకున్నారు. వెడ్డింగ్ షూట్‌లో అతడు అసభ్యకరంగా ప్రవర్తించడం, రెండ్రోజులు దూర ప్రాంతానికి వెళ్దామని ఒత్తిడి తీసుకురావడంతో భయపడిపోయింది. ఈ విషయం ఇంట్లో చెప్పగానే జోడు కుదరదంటూ పెళ్లి వద్దు అనుకున్నారు. దీన్ని మనసులో ఉంచుకున్న అతడు ఇద్దరు దిగిన ఫొటోలను మార్ఫింగ్ చేసి పోర్న్‌సైట్‌లో పెట్టాడు.
సరైన జోడు కాదు అనిపిస్తే వివాహం రద్దు : నగరంలో ఇటీవల ఈ తరహా ఘటనలు తరచూ బయటపడుతున్నాయి. అమ్మాయి తరపు కుటుంబం వివిధ కారణాలతో పెళ్లిని తిరస్కరిస్తే కొందరు ప్రబుద్ధులు తట్టుకోలేకపోతున్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. అమ్మాయిలకు నరకం చూపుతున్నారు. వధూవరులు ఒకరి గురించి ఒకరు సరిగ్గా తెలుసుకోకుండానే ఫోన్‌నంబర్లు మార్చుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్‌లలో ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటారని అభిప్రాయంతో తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యమిస్తున్నారు. పెళ్లిపీటలు ఎక్కేముందు తమకు సరైన వ్యక్తి కాదని ఆడపిల్లలు భావిస్తే తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేస్తున్నారు.
'కమిట్‌మెంట్ ఇస్తే పక్కా ఉద్యోగం నీకే డియర్' - మహిళకు వేధింపులు, ఏం చేసిందంటే
అప్పుడే అన్ని విషయాలు చెప్పకూడదు : పెళ్లి చూపులు అవ్వగానే అమ్మాయిలు తమ వ్యక్తిగత వివరాలు, కుటుంబ విషయాలు, ఫోన్ నంబరు ఇవ్వకూడదని, వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దని అంటున్నారు. వారి గురించి ముందు వెనుక తెలుసుకోవాలని, ప్రతి విషయంలో తల్లిదండ్రుల సూచనలు తీసుకోవాలని చెబుతున్నారు. పెళ్లిముసుగులో కొందరు ప్రబుద్ధులు ప్రదర్శించే వికృతాలను గుర్తించినప్పుడు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.