Patient Meals Problems in Govt Hospitals : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యంతో పాటు భోజనం అందిస్తారు. కానీ ఆ భోజనంలో నాణ్యత లోపిస్తోంది. దీంతో రోగులు, సంరక్షకులు ఇదేం భోజనం అంటూ నోళ్లు నెమరవేసుకుంటున్నారు. దీని అంతటికీ కారణం గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడమేనని తెలుస్తోంది. దీంతో ఆ ప్రభావం రోగుల భోజన నాణ్యతపై పడుతోంది. గత రెండు, మూడేళ్లుగా ఇందుకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదంట.
అయితే గతంలో ఒక్కో రోగికి రూ.40 వరకు డైట్ ఛార్జీలు అందిస్తే.. తర్వాత దాన్ని రూ.80కి పెంచారు. అయినాసరే నాణ్యతలో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు. కానీ గుత్తేదారులు మాత్రం బిల్లులు ఆలస్యమైనా వస్తాయనే నమ్మకంతో అప్పు చేసైనా సరే రోగులకు భోజనం పెడుతున్నారు. అయితే ఏ ఆసుపత్రుల్లో ఎంత బకాయిలు ఉన్నాయి.. అసలు రోగులకు ఎలాంటి భోజనం పెడుతున్నారో తెలుసుకుందాం.
పెండింగ్‌లో ఉన్న బిల్లులు :
- గాంధీ ఆసుపత్రులో అత్యధిక రోగుల తాకిడి ఉంటుంది. ఇక్కడ రోగుల భోజన బకాయిలు రూ.3.5 కోట్లకు చేరింది. వాస్తవానికి ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాల్సి ఉంది. కానీ బిల్లులు వసూలు కాక గుత్తేదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి తప్పడం లేదు.
- అలాగే ఛాతి ఆసుపత్రిలో బకాయిలు రూ.1.20 కోట్లకు చేరింది.
- మరోవైపు ఎర్రగడ్డ మానసిక చికిత్సల కేంద్రంలో మాత్రంలో ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి మొత్తం రూ.60 లక్షలు. దీంతో రోగులకు పెట్టే ఆహారం నాణ్యత విషయంలో గుత్తేదారులు రాజీపడుతున్నారు.
- ఈఎన్టీ, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రుల్లో సైతం ఆరేడు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఆసుపత్రుల్లో భోజన నాణ్యత :
- గాంధీ ఆసుపత్రిలో నిత్యం వేయి మంది రోగుల వరకు భోజనం అందిస్తారు. గుత్తేదారులకు బిల్లులు చెల్లించక భోజనం రుచి లేక చప్పగా ఉంటోందని రోగులు చెబుతున్నారు.
- నిలోఫర్ ఆసుపత్రిలో డైట్ కాంట్రాక్టర్ గడువు ముగిసిన.. వెంటనే టెండర్లు పిలవాల్సి ఉన్నా ప్రస్తుతం కాంట్రాక్టర్నే కొనసాగిస్తున్నారు. ఆహారంలో నాణ్యత కనిపించడం లేదని రోగులు వాపోతున్నారు. చిక్కీ(పల్లీపట్టి) కనిపించడం లేదని పలువురు తెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడన్న డైటీషియన్ కూడా బదిలీపై వేరే చోటుకు వెళ్లిపోయారు.
- ఉస్మానియా ఆసుపత్రిలో చీప్ డైటీషియన్ పోస్టు ఖాళీ అయిపోయింది. ఇక్కడ నిత్యం వేయి మందికి పైగా రోగులకు అల్పాహారాన్ని అందిస్తారు. దీనితో పాటు భోజనం కూడా వారికి ఇస్తున్నారు. చీఫ్ డైటీషియన్ లేక అక్కడ పరిశీలన తూతూ మంత్రంగా సాగుతోంది.
- కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రి, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి(జీహెచ్ఎంసీ) ఆసుపత్రిలో డైట్ మేరకు సక్రమంగా ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే ఇంకా నాణ్యత పెరిగితే బాగుంటుందని రోగులు తెలుపుతున్నారు.
- మెహిదీపట్నంలోని సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే పాలు పలుచగా ఉండగా.. అసలు రుచి అనేది లేకుండా పోయిందని చెబుతున్నారు.
- కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో సాంబారు, పప్పు నీళ్ల మాదిరిగా ఉంటున్నాయని రోగులు తెలుపుతున్నారు. ఇక్కడ రూ.40 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు తెలిసింది.