తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో కొండచరియలు విరిగిపడి పలువురు మృతి - శిథిలాల కింద అనేక మంది! ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - Wayanad landslides

Wayanad landslides : కేరళలోని వయనాడ్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొండ చరియాలు విరిగిపడి 50మంది మృతి చెందారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Wayanad landslides
Wayanad landslides (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 30, 2024, 7:54 AM IST

Updated : Jul 30, 2024, 10:42 AM IST

Wayanad landslides: కేరళలోని వయనాడ్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి 50మంది మృతి చెందారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారి కోసం ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

అర్ధరాత్రి బీభత్సం
మెప్పాడి ముండకైలో ప్రాంతంలో అర్ధరాత్రి ఒంటిగంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్‌కు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు
తొండర్‌నాడ్ గ్రామంలో నివసిస్తున్న నేపాలీ కుటుంబానికి చెందిన ఒక చిన్నారి ఈ ప్రమాదంలో మరణించిందని వయనాడ్ జిల్లా అధికారులు తెలిపారు. ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించింది. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది.

ప్రధాని మోదీ దిగ్బ్రాంతి
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం చేస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పాలన యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. మరోవైపు, ఈ ఘటన తనను తీవ్రంగా కలవరపరించిందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

లోక్​సభలో​ వాయిదా తీర్మానం
వయనాడ్​లో​ కొండచరియలు విరిగిపడిన ఘటనపై అత్యవసరంగా చర్చించాలని కాంగ్రెస్​ ఎంపీ హిబి హిడెన్ లోక్​సభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు.

Last Updated : Jul 30, 2024, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details