Strikes Protests Ban Sabarimala : శబరిమలలో ధర్నాలు, నిరసనలపై కేరళ హైకోర్టు నిషేధం విధించింది. శబరిమల ఆధ్యాత్మిక ప్రదేశం అని, అక్కడ ధర్నాలు, నిరసనలకు అనుమతించలేమని కోర్టు స్పష్టం చేసింది. శబరిమలలో తమ సేవలకు ముందుగానే రుసుము చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు ఆలోచనకు వ్యతిరేకంగా డోలీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. పంపా, సన్నిధానంలో నిరసనలు, సమ్మెలపై నిషేధం విధించిన హైకోర్టు- అవి భక్తులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయని తెలిపింది. డోలీ కార్మికులకు ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించింది.
'శబరిమల ఆధ్యాత్మిక స్థలం. అక్కడ ధర్నా, నిరసనలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దేవస్వమ్ బోర్డు భవిష్యత్‌లో ఇది పునరావృతం కాకుండా చూడాలి. ఇక అనేక మంది భక్తులు శబరిమలకు వస్తుంటారు. అందులో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఉంటారు. అలాంటివారికి డోలీ సేవ అందుబాటులో లేకపోతే ఎలా?' అని కోర్టు ప్రశ్నించింది. డోలీ సేవ పొందే యాత్రికుల భద్రతే ముఖ్యమని కోర్టు పేర్కొంది.
కార్మికుల సమ్మెకు కారణం ఇదే!
శబరిమలలో డోలీ సేవలకు యాత్రికులు ముందుగానే రుసుము చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టాలని ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు నిర్ణయించింది. దీనికి నిరసనగా డోలీ కార్మికులు పంపా వద్ద సమ్మెకు దిగారు. ఈ ప్రీ పెయిడ్ విధానం గురించి తమతో సంప్రదింపులు జరపకుండానే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని కార్మికులు ఆరోపించారు. సమ్మె కారణంగా డోలీ సేవలు వినియోగించుకోవాలనుకునే భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
సమ్మె విరమణ
జిల్లా మేజిస్ట్రేట్‌తో చర్చించిన తర్వాత డోలీ కార్మికులు నిరసనను విరమించుకున్నారు. తమ డిమాండ్లను రాతపూర్వకంగా ఇవ్వాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు. సంబంధిత అధికారుల ఎదుట తమ డిమాండ్లను తెలిపేందుకు అవకాశం కల్పిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు సమ్మె విరమించారు. ఇక సమ్మె విరమణతో డోలీ సేవ వినియోగించుకునే యాత్రికులకు ఊరట దక్కినట్లే!
హైకోర్టు ఆదేశాల మేరకు డోలీ సేవలను ప్రీ పెయిడ్ విధానంలో ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం పంపా, నీలిమల వద్ద మూడు కౌంటర్లు ఏర్పాటు చేసింది. కౌంటర్ ద్వారా వసూల్ చేసిన మొత్తాన్ని, తర్వాత డోలీ కార్మికులకు అందజేస్తారు.
అసలేంటీ డోలీ సర్వీస్?
పంపా, సన్నిధానం మధ్య ట్రెకింగ్ దారిలో నడవలేని స్థితిలో ఉన్న యాత్రికులను డోలీల్లో మోస్తూ శబరిమల చేరుస్తారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్న యాత్రికులు ఈ డోలీ సేవను ఎక్కువగా వినియోగించుకుంటారు. యాత్రికులను శబరిమల తీసుకెళ్లేందుకు రెండు వెదురు కర్రలపై అమర్చిన 'డోలీ' అనే కుర్చీ ఉపయోగిస్తారు. ఒక్క డోలీనీ నలుగురు కార్మికులు మోస్తారు. యాత్రికుల బరువు ఆధారంగా ఈ సర్వీస్‌కు రుసుము ఉంటుంది. ఐదు కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణానికి దాదాపు 90 నిమిషాల సమయం పడుతుంది. ఇక బోర్డు వద్ద దాదాపు 1532 మంది డోలీ కార్మికులుగా నమోదు చేసుకోగా, మొత్తం 308 డోలీలు ఉన్నాయి.
శబరిమల వెళ్లేవారికి గుడ్ న్యూస్ - నిమిషాల్లోనే రూమ్ బుక్ చేసుకోండిలా!
శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్ - ఇరుముడికట్టులో ఆ వస్తువులు తేవొద్దని బోర్డు విజ్ఞప్తి