Precautions To Take When Going On Vacation : ఏదైనా కొత్త ప్రాంతంపై అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం, హెచ్చరికలు ఖాతరు చేయకపోవడం, సంబంధిత ప్రభుత్వ విభాగ పర్యవేక్షణలోపం, కారణం ఏదైనా విహార యాత్రలు విషాదంగా మారుతున్నాయి. వారాంతాలు, సెలవుల్లో హైదరాబాద్ సిటీ శివార్లు, ఇతర జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్న యువత జలపాతాలు, కుంటలు, చెరువులు, నిర్మాణ అవసరాలకు తవ్విన గుంతల్లో ప్రమాదవశాత్తూ మృత్యువాతపడుతున్నారు.
ఎక్కువగా 15 నుంచి 25 ఏళ్లలోపు వారే : హైదరాబాద్ నగరంలో ప్రమాదవశాత్తూ జలవనరుల్లో పడి ఏటా సుమారు 150 మంది వరకు మృతి చెందినట్లు అంచనా. వారిలో 15 నుంచి 25 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు.
కనిపించని హెచ్చరికలు : జలవనరులు ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు, పర్యవేక్షణ లేకపోవడం అతి పెద్ద సమస్యగా మారుతోంది. హైదరాబాద్‌లో వందలాది తటాకాలు ఉన్నా రక్షణ చర్యలు నామమాత్రమే. పహాడీషరీఫ్ పరిధిలోని జల్‌పల్లి చెరువులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా రక్షణ చర్యలు, పర్యవేక్షణ కరవే. పల్లె చెరువు, ఉందాసాగర్, హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో క్వారీ గుంతల వద్ద ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.
ఐదుగురు మృతి : 2024 డిసెంబరు 17న హైదరాబాద్ సిటీలోని ఎల్బీనగర్‌కు చెందిన యువకులు సరదాగా గడిపేందుకు కారులో నగర శివారు ప్రాంతాలకు వెళ్లారు. పోచంపల్లి మండలం జలాల్‌పూర్ చెరువు కట్టపైకి వెళ్లగానే కారు అదుపుతప్పి తటాకంలోకి దూసుకెళ్లింది. ఐదుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
మునిగిపోయిన ఐదుగురు : గత సంవత్సరం జనవరి 12న నగరంలోని ఓ వివిధ ప్రాంతాలకు చెందిన మిత్ర బృందం విహార యాత్రకు సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లారు. వారంతా జలాశయంలోకి దిగారు. ఒకరి తరువాత ఒకరు ఐదుగురు మునిగిపోవడంతో వారి కుటుంబాలకు పెను విషాదాన్ని మిగిల్చింది.
ఫొటో షూట్‌లతో అసలు సమస్య : ఇటీవల జలపాతాలు, జల వనరుల వద్ద ప్రమాదాలకు ఫొటోల మోజే ప్రధాన కారణం అవుతోందని పోలీసులు అంటున్నారు. కొండపోచమ్మ సాగర్‌లో ఐదుగురు మునిగిపోవడానికి సెల్ఫీనే కారణమని తెలిపారు. నీటిలో వెనక్కి నడుస్తూ ఒక్కసారిగా లోతులోకి జారిపోయారు. గతంలో కీసర వద్ద చెరువులో వీడియో బాగా వస్తుందని లోపలికి వెళ్లారు. దీంతో ముగ్గురు మృతి చెందారు.
ఈ జాగ్రత్తలు పాటించాలి : -
- ఈత వచ్చినా సరే కొత్త ప్రాంతాల్లోని జలవనరుల్లోకి దిగేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి లోతు ఎంత ఉందో తెలుసుకున్నాకే దిగాలి.
- నదులు, చెరువులు, జలాశయాల అడుగున బురద ఉంటుంది. గమనించకుండా దిగితే కూరుకుపోతారు.
- ట్యూబులు, లైఫ్ జాకెట్లు వంటి రక్షణ చర్యలు తీసుకున్నా నిర్లక్ష్యంగా ఉండవద్దు.
- మిత్రులకు ఈత వచ్చు, చూసుకుంటారని అనుకోవద్దు. నీటిలో మునిగినప్పుడు ఈత వచ్చినవారిని గట్టిగా పట్టుకుంటే మునిగిపోతారు. ఎవ్వరూ రక్షించలేరు.
- చిన్న పిల్లలు జల వనరుల వద్ద ఆడుకుంటున్నప్పుడు పెద్దలు వారిని గమనిస్తూ ఉండాలి.
- యువత పోటీపడి నీటిలో దూకకూడదు. రాళ్లు ఉన్న చోట దూకితే గాయాలు అవుతాయి.
హైదరాబాద్ నుంచి కొత్త పర్యాటక ప్యాకేజీలు - ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేలా ప్లాన్!
ఈ మంచు వేళల్లో పాపికొండలు టూర్ - తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ!