Budget 2025 Income Tax Changes : మధ్య తరగతి, వేతన జీవులకు భారీ శుభవార్త. ఇకపై రూ. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి మరో రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే రూ.12,75,000 వరకు పన్ను ఉండదు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. కొత్త ఆదాయపు పన్ను విధానంలో శ్లాబ్‌లను మార్చుతున్నట్లు తెలిపారు.
కొత్త పన్ను ప్రకటనతో ప్రస్తుతం రూ.12 లక్షల ఆదాయం వరకు ఉన్నవారికి అత్యధికంగా రూ.80,000 వరకు మిగిలే అవకాశం ఉంది. రూ.18 లక్షల ఆదాయం ఉన్నవారు ప్రస్తుతం 30 శాతం వరకు చెల్లిస్తున్నారు. వీరికి తాజా మార్పులతో రూ.70,000 వేలు వరకు మిగిలే అవకాశం ఉంది. రూ.25 లక్షల ఆదాయం ఉన్నవారు మారిన శ్లాబ్‌తో రూ.1.10 లక్ష వరకు మిగిలే అవకాశం ఉంది.
అయితే సెక్షన్ 80 సీసీసీ కింద రూ.1.5 లక్షల మినహాయింపు, గృహ రుణాలపై వడ్డీ చెల్లించేందుకు రూ.1.5 లక్షల మినహాయింపు వంటి ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పన్ను చెల్లింపుదారుడు ఉపశమనం పొందితేనే ఈ మినహాయింపు లభిస్తుంది.
వచ్చే వారం కొత్త బిల్లు
మరోవైపు, వచ్చే వారం ఆదాయ పన్నుపై బిల్లును తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. "ముందు విశ్వాసం-తర్వాతే పరిశీలన అనే విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వచ్చే వారం కొత్త ఆదాయ పన్ను బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నాం. ఈ బిల్లు ఆదాయ పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తుంది. ప్రస్తుత ఆదాయ పన్ను నిబంధనల్లో సగానికి తగ్గిస్తాం. టీడీఎస్, టీసీఎస్‌ను కూడా క్రమబద్ధీకరిస్తాం" అని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
వృద్ధులకు ఉపశమనం
ఈ సందర్భంగా వృద్ధులకు నిర్మల ఉపశమనం కల్పించారు. "సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ (TDS) పరిమితిని రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచుతున్నాం. ఇక, అద్దెలపై వచ్చే ఆదాయంపై టీడీఎస్‌ను రూ.2.4లక్షల నుంచి రూ.6లక్షలకు పెంచుతున్నాం" అని ఆర్థిక మంత్రి వివరించారు.
ఐటీ రిటర్నుల గడువు పెంపు!
ఐటీ రివైజ్డ్ రిటర్నుల సమర్పణకు గడువును పెంచారు. ఏదైనా మదింపు సంవత్సరానికి అప్‌డేటెడ్ రిటర్నులు సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న రెండేళ్ల కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలకు టీసీఎస్‌ను మినహాయిస్తున్నట్లు వెల్లడించారు.