Rinku Singh Marriage : టీమ్ఇండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ పెళ్లి వ్యవహారంపై క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం సాగుతున్నట్లుగానే రింకూ ఉత్తర్‌ప్రదేశ్ ఎంపీ ప్రియా సరోజ్‌ను వివాహం చేసుకోనున్నాడు. ఇరు కుటంబాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగిన తర్వాత పెళ్లికి లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు ఎంపీ తండ్రి తూఫాని సరోజ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. రింకూ- ప్రియా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని చెప్పారు. అలాగే ఇప్పటివరకు ఎలాంటి నిశ్చితార్థం జరగలేదని స్పష్టం చేశారు.
'రింకూ- ప్రియా సంవత్సరం నుంచి ఒకరినొకరు బాగా తెలుసు. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అయితే దీనికి ఇరు కుటుంబాల అంగీకారం అవసరం. రెండు కుటుంబాలు ఈ పెళ్లికి ఒప్పుకున్నాం' అని ప్రియా తండ్రి తుఫాని సరోజ్ తెలిపారు. ఇప్పటికైతే నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తం ఖరారు కాలేదని తుఫాని చెప్పారు. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఎంగేజ్మెంట్ ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. లఖ్‌నవూలోనే ఈ వేడుక జరుగుతుందని తుఫాని స్పష్టం చేశారు.
ఎవరీ ప్రియా సరోజ్?
ప్రియా సరోజ్(26) ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజకీయవేత్త, న్యాయవాది. ఆమె సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సభ్యురాలు. 25 ఏళ్లకే పార్లమెంటులో అడుగు పెట్టారు. అతిచిన్న వయస్సులో ఎంపీ అయిన వారిలో ఒకరిగా నిలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో మచ్‌లిషహర్ నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ లీడర్ బీపీ సరోజ్‌ని ఓడించి, తన కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ముందు, ప్రియా న్యాయవాద వృత్తిలో రాణించారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఆమె దిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి, తూఫాని సరోజ్ అదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1999, 2004, 2009లో ఎంపీగా సేవలు అందించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.
మరోవైపు రింకూ ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. ఈనెల 22 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
MPతో రింకూ సింగ్ సీక్రెట్ ఎంగేజ్మెంట్!- నిజమెంత?
ప్రైవేట్ పూల్, రూఫ్‌టాప్ బార్ - రింకు కొత్త ఇంట్లో ఏయే వసతులు ఉన్నాయంటే?