Kolkata Doctor Murder Case : దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కు సీల్దా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్‌రాయ్‌ను భారతీయ న్యాయసంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద శనివారం దోషిగా తేల్చిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ సోమవారం మధ్యాహ్నం ఈమేరకు తీర్పు ఇచ్చారు. రూ.50 వేల జరిమానా కూడా విధించారు. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం చెల్లించాలని బంగాల్ ప్రభుత్వానికి ఆదేశించారు.
'కావాలనే ఇరికించారు'
కట్టుదిట్టమైన భద్రత మధ్య దోషి సంజయ్‌రాయ్‌ను సీల్దా కోర్టుకు తరలించారు. 500 మంది పోలీసులను మోహరించారు. శిక్ష ఖరారు చేయడానికి ముందు తన వాదనను వినిపించుకోవడానికి జడ్జి అతడికి అవకాశం కల్పించారు. తాను ఏ నేరమూ చేయలేదని ఈ సందర్భంగా సంజయ్ కోర్టులో చెప్పాడు. ఏ కారణం లేకుండానే తనను ఇందులో ఇరికించినట్లు వాపోయాడు. తనతో బలవంతంగా కాగితాలపై సంతకాలు చేయించారని, తాను అమాయకుడినని వాదించాడు. ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలు ధ్వంసమయ్యాయని తాను విన్నట్లు తెలిపాడు. మరోవైపు సీబీఐ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఇది చాలా అరుదైన కేసని, ఈ ఘటన పౌర సమాజాన్ని ఎంతగానో కలచి వేసిందని గుర్తు చేశారు. దోషి సంజయ్‌రాయ్‌కు ఉరిశిక్ష విధించాలని కోరారు. వైద్యులకే రక్షణ లేకపోతే ఇంకేం చేయాలని, మరణశిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని పునరుద్ధరించగలదని వాదించారు. ఇరు పక్షాల వాదనలు జడ్జి ఇది అరుదైన కేసు కాదని పేర్కొంటూ, చివరకు జీవిత ఖైదు విధించారు.
#WATCH | Advocate Rehman says, " additional judge of sessions court, sealdah has sentenced life imprisonment till death to sanjay roy. the court directed the state government to give compensation of rs 17 lakhs to the victim's family. cbi had demanded capital punishment for the… pic.twitter.com/fBl7fxEPIt
— ANI (@ANI) January 20, 2025
'న్యాయమే కావాలి'
మరోవైపు పరిహారం తీసుకునేందుకు బాధితురాలి తల్లిదండ్రులు నిరాకరించారు. తమకు పరిహారం వద్దని, న్యాయం మాత్రమే కావాలని పేర్కొన్నారు.
'ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశాం'
సంజయ్ రాయ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించడంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. తామంతా దోషికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారని, కానీ కోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో సంతృప్తి చెందలేదని అన్నారు.
Today, the Court has pronounced death sentence for the convict who had raped and murdered the small girl of Gurap and I thank the Judiciary for that.
— Mamata Banerjee (@MamataOfficial) January 17, 2025
I thank Hooghly Rural District Police for their swift action and thorough probe that ensured speedy trial and conviction in 54…
162 రోజుల తర్వాత తీర్పు
31 ఏళ్ల వైద్యురాలిపై కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో గత ఏడాది ఆగస్టు 9వ తేదీన హత్యాచార ఘటన జరిగింది. వైద్యురాలి మృతదేహాన్ని ఆగస్టు 10న ఆస్పత్రి సెమినార్ హాల్‌లో గుర్తించారు. అదే రోజు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కోల్‌కతా పోలీసులు కేసును తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపణలు రావడం వల్ల కలకత్తా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఆగస్టు 14న కోల్‌కతా పోలీసుల నుంచి హత్యాచార కేసును సీబీఐ స్వీకరించింది. నిందితుడు సంజయ్‌కు లై డిటెక్టర్ టెస్ను నిర్వహించింది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు సీబీఐ అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత జనవరి 18న ఈ కేసులో తీర్పు వచ్చింది. సీల్దా కోర్టులో రహస్యంగా సాగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు ఈ నెల 9న పూర్తయ్యాయి. వైద్యురాలిపై సంజయ్‌రాయ్ అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత గొంతు నులిమి హతమార్చినట్లు సీబీఐ రుజువు చేయగలిగిందని జడ్జి పేర్కొన్నారు.
ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ ఛార్జి అభిజిత్ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా, తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్టయిన దగ్గరినుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేయకపోవడం వల్ల ఈ బెయిల్ లభించింది.