Telangana Govt plans on Traffic In Hyderabad : నగరంలో ట్రాఫిక్ సమస్యలు ప్రజలను, వాహనదారులను రోజురోజుకు వేధిస్తోంది. ఇప్పటికే ఎల్బీనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఆకాశమార్గాలతో కొంత ఇబ్బందులు తీరాయి. అయితే ఈసారి ప్రధానమైన జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ మేరకు మొదటి దశలో రూ.3 వేల 500 కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, గ్రేడ్ సపరేటర్లను నిర్మించనున్నారు. రెండో దశలో మియాపూర్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, కోఠి, అబిడ్స్ ప్రాంతాలపై దృష్టి సారించనున్నారు. సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు నివేదికలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
మెహిదీపట్నంలో
- అత్తాపూర్, లంగర్‌హౌజ్, హైటెక్‌సిటీ, మెహిదీపట్నంలో ట్రాఫిక్ సమస్య రాకుండా టోలిచౌకి నుంచి నానల్‌నగర్ చౌరస్తా మీదుగా లంగర్‌హౌజ్‌కు 1.36 కి.మీ పొడవునా పైవంతెన నిర్మించనున్నారు.
- హైటెక్‌సిటీ వైపు వెళ్లే వాహనాలు నానల్‌నగర్‌లో ఆగకుండా 680 కిలోమీటర్ల పొడవునా రెండోస్థాయి పైవంతెన నిర్మించనున్నారు.
- టోలిచౌకి - అత్తాపూర్ వైపు రేతిబౌలి చౌరస్తా, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా కిలోమీటరు పొడవునా రెండోస్థాయి పైవంతెన నిర్మించనున్నారు.
- రేతిబౌలి చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా అత్తాపూర్ నుంచి మెహిదీపట్నం వెళ్లే వాహనాల కోసం దాదాపు రూ.398 కోట్లతో 960 మీటర్ల పొడవునా పైవంతెనల నిర్మాణం చేపట్టనున్నారు.
నాగార్జున సర్కిల్‌లో
- పంజాగుట్ట హిందూ శ్మశానవాటిక నుంచి నిమ్స్ వైపు వెళ్లే వాహనాల కోసం 145 కోట్ల రూపాయలతో నాగార్జున సర్కిల్ మీదుగా కిలోమీటరు పొడవునా పైవంతెన నిర్మించనున్నారు.
- బంజారాహిల్స్ రోడ్డు 3, టీవీ 9 కార్యాలయం కూడలిలో బంజారహిల్స్ నుంచి పంజాగుట్ట కూడలి వైపు వెళ్లే వాహనాల కోసం రూ. 65 కోట్లతో అండర్‌పాస్ నిర్మించబోతున్నారు.
- బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు రూ.150 కోట్లతో 100-120 అడుగుల వెడల్పునా రోడ్డు విస్తరణ చేయనున్నారు.
- ఖాజాగూడ చౌరస్తాలో టోలిచౌకి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాల కోసం 220 కోట్ల రూపాయలతో అండర్‌పాస్, నానక్‌రామ్‌గూడ నుంచి టోలిచౌకి వైపు పైవంతెన నిర్మించబోతున్నారు.
ట్రిపుల్ ఐటీ కూడలిలో
- రూ.459 కోట్ల వ్యయంతో ఐటీ కారిడార్‌లో డీఎల్‌ఎఫ్ రోడ్డు నుంచి ఐఎస్‌బీ రోడ్డుకు ఓ పైవంతెన, డీఎల్‌ఎఫ్ రోడ్డు నుంచి గచ్చిబౌలి స్టేడియం దిశలో పైవంతెన, గచ్చిబౌలి కూడలి-గచ్చిబౌలి స్టేడియం మధ్య ఆరు లైన్ల అండర్‌పాస్ నిర్మించనున్నారు.
- ఐసీఐసీఐ చౌరస్తాలో విప్రో జంక్షన్-ఓఆర్‌ఆర్ మధ్య 4 లైన్ల అండర్‌పాస్, విప్రో చౌరస్తాపై ఐఎస్‌బీ రోడ్డు-ఓఆర్‌ఆర్ మధ్య 4 లైన్ల పైవంతెన (వ్యయం రూ.158 కోట్లు).
- 530 కోట్ల రూపాయలతో మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్డు చౌరస్తా మీదుగా పటాన్‌చెరు-జేఎన్‌టీయూ మధ్య 6 లైన్ల పైవంతెన, ఆల్విన్ చౌరస్తా నుంచి కొండాపూర్ వైపు 3 లైన్ల అండర్‌పాస్‌ను నిర్మించబోతున్నారు.
- గచ్చిబౌలి, బీహెచ్‌ఈఎల్ మధ్య రూ.124 కోట్లతో లింగంపల్లి రైల్వే మార్గంపై పైవంతెన నిర్మించనున్నారు.
- చింతల్‌లోని ఫాక్స్‌సాగర్ వరదనాలాపై రూ.56 కోట్లతో 4 లైన్ల ఉక్కు వంతెన నిర్మించనున్నారు.
- రూ.180 కోట్ల వ్యయంతో కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు చౌరస్తాలో అమీర్‌పేట నుంచి కూకట్‌పల్లి వైపు 3 లైన్ల పైవంతెన, కూకట్‌పల్లి వై జంక్షన్‌లో కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట వైపు 3 లైన్ల పైవంతెన నిర్మించనున్నారు.
- రూ.39 కోట్లతో సైబరాబాద్ కమిషనరేట్ నుంచి గచ్చిబౌలి చౌరస్తా వరకు 215 అడుగుల రహదారి విస్తరణ.
- ఎన్‌హెచ్ 65 నుంచి అమీన్‌పూర్ వరకు రూ.45 కోట్లతో రోడ్డు విస్తరణ.
- రూ.31 కోట్లతో అంజయ్యనగర్ నుంచి రాంకీ టవర్స్ వరకు 150 అడుగుల మేర రోడ్డు విస్తరణ.
హైదరాబాద్ - శ్రీశైలం హైవేపై ఇక రాత్రిళ్లూ దూసుకెళ్లొచ్చు - ఆ ప్రాజెక్టు పూర్తయితేనే?
7 జాతీయ రహదారుల పనులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ - బండి ఇక ఆగేదే లే!