Telangana RTC Transports 5 Lakh People : సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగర వాసులు సొంతూళ్లకు భారీగా తరలి వెళ్తున్నారు. గత రెండు మూడు రోజులుగా భారీగా రద్దీ కొనసాగుతోంది. ఓ వైపు రైళ్లు ఫుల్లుగా కిక్కిరిసిపోవడం, ప్రైవేటు వాహనాలలో ఇష్టారితీన ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు జేబుకు చిల్లు పడకుండా తెలంగాణ ఆర్టీసీ బాటపడుతున్నారు.
దీంతో ఆర్టీసీకి ఖజానాలో కాసుల వర్షం కురుస్తోంది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే ఐదు లక్షల మంది ప్రజలు ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 6,432 బస్సులను నడపాలని ముందుగా నిర్ణయించిన టీజీఎస్‌ఆర్టీసీ, ఇప్పటి వరకు 5 వేలకు పైగా బస్సులను రొడ్డెక్కించింది. మరి కొన్ని గంటలపాటు ఈ రద్దీ కొనసాగే అవకాశమున్న నేపథ్యంలో స్పెషల్ బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు సంబంధిత యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు.