Drugs case in maharashtra : మాదక ద్రవ్యాల కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు మహారాష్ట్ర వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ నిందితుడు చేసిన పనులు అచ్చం సినిమాను తలపించాయి. నిందితుడు తప్పించుకునే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు పదో అంతస్తు బాల్కనీ నుంచి దూకేందుకు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో చాలాసేపు ఉత్కంఠ నెలకొంది. తీవ్రంగా శ్రమించి పోలీసులు చివరకు అతడ్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసులో మతీన్ ప్రధాన నిందితుడు. ఏడు నెలలుగా పరారీలో ఉన్న మతీన్, మహారాష్ట్రలోని ఠాణెలో ఉన్నట్లు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. దీంతో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ వారెంట్ రెడీ చేసుకుని అక్కడికి వెళ్లారు. మహారాష్ట్రలోని స్థానిక కాశీమీరా పోలీస్‌స్టేషన్ సిబ్బంది సహకారంతో మతీన్ కోసం సోమవారం (డిసెంబర్ 02) మీరా రోడ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడి ఓ అపార్టుమెంట్‌లోని పదో అంతస్తులో నిందితుడు ఉన్నట్లు తెలుసుకున్నారు. మెల్లగా గుట్టు చప్పుడు కాకుండా అపార్ట్మెంట్లోకి ప్రవేశించారు.
మాటల్లో పెట్టి అదుపులోకి : నిందితుడు నివాసం ఉన్న ఇంటి తలుపు తట్టారు. పోలీసులు తన కోసమే వచ్చారని నిందితుడు మతీన్ విషయాన్ని గ్రహించాడు. ఇక తప్పించుకునే క్రమంలో బాల్కనీలోని గ్రిల్స్ తీసి అక్కడి నుంచి దూకేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడితో మాట్లాడుతూనే స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బాల్కనీ పక్కన ఓ పెద్ద వల ఏర్పాటు చేశారు. కొందరు పోలీసులు అతడిని మాటల్లో పెట్టి అపార్ట్‌మెంట్ లోపలికి వెళ్లి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఠాణె న్యాయస్థానంలో హాజరు పరిచిన అనంతరం హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.
మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు మాదక ద్రవ్యాల సరఫరాపై నిఘాను మరింత పటిష్టం చేశారు. ఈ డ్రగ్స్ కేసుల్లో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.
డ్రగ్స్ విషవలయంలో చిక్కుకుంటున్న యువత - అడ్డుకోవడం ఎలా? - Prathidwani Debate on Drugs