Tiruchanur Padmavathi Ammavari Rathotsavam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు అమ్మవారికి జరుగనున్న ఉత్సవ వాహన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
రథోత్సవం - అశ్వ వాహనసేవ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు అంటే 5 డిసెంబర్ 2024 గురువారం ఉదయం శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం జరుగుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహన సేవ జరుగనున్నాయి.
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం ఉదయం 8.40 గంటలకు అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగగా జరుగనుంది.
అమ్మవారి రథోత్సవం విశిష్టత
సర్వాలంకార శోభితమైన రథంలో సిరుల తల్లి అలమేలు మంగ సర్వాలంకార భూషితురాలై తిరుచానూరు పవిత్ర మాడ వీధులలో సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయ క్షేత్రాలలో తాత్త్విక బీజాలు విత్తే ఒక యజ్ఞంగా శాస్త్రం అభి వర్ణిస్తోంది.
రథోత్సవ దర్శన ఫలం
కార్తీక బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు జరిగే రథోత్సవ వేడుకలో సింగారించిన పాలకడలి గారాల పట్టిని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. అంతేకాదు రథోత్సవంలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం.
పూర్వజన్మ సుకృతం
అశేష జనవాహిని పద్మావతి పాలయమాం అంటూ కీర్తిస్తుండగా, జరిగే ఈ రథోత్సవంలో భక్తులందరూ అమ్మవారి రథాన్ని లాగడానికి ఉత్సాహం చూపిస్తారు. పరమ పవిత్రమైన ఈ రథోత్సవంలో పాల్గొని, అమ్మవారు అధిరోహించిన రథాన్ని లాగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. రథోత్సవ శుభవేళ శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహం భక్తులందరిపై పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.