Maharashtra CM Fadnavis : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్ పేరును ఖరారు చేశారు. అనంతరం ముంబయిలోని విధాన్ భవన్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో ఫడణవీస్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ హాజరయ్యారు.
Mumbai: After being unanimously elected as the Leader of Maharashtra BJP Legislative Party, Devendra Fadnavis says " ...i want to tell you all that in the next days few, there will be things of our wish and a few things will be against our wishes but we all have to work in the… pic.twitter.com/kdLFgDktbj
— ANI (@ANI) December 4, 2024
బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో ఏక్‌నాథ్ శిందే, దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్ భేటీ కానున్నారు. గర్నర్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. గురువారం ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఎన్డీఏ కీలక నేతలు దీనికి హాజరుకానున్నారు. సీఎంగా ఫడణవీస్‌తో పాటు శివసేన నేత ఏక్‌నాథ్ శిందే , ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
'అందరం కలిసి పని చేయాలి'
రానున్న రోజుల్లో మనకు కొన్ని అనుకూల అంశాలతో పాటు ప్రతికూల అంశాలు కూడా ఉంటాయని దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. అయితే రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేసి అనుకున్న లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఫఢ్నవీస్ ఈ మేరకు పేర్కొన్నారు.
VIDEO | #Maharashtra: Devendra Fadnavis (@Dev_Fadnavis) was unanimously elected as party leader in BJP legislature party meeting in Mumbai. No other name was proposed.
— Press Trust of India (@PTI_News) December 4, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/8AFRj1CgLi
సీఎంగా మూడోసారి బాధ్యతలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 సీట్లకు గాను బీజేపీ 132 స్థానాల్లో విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. మహాయుతి కూటమి మొత్తంగా 230 స్థానాలు సొంతం చేసుకుంది. అయితే, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై కూటమిలో కొన్నిరోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది. సీఎం ఎంపిక, శాఖల కేటాయింపులపై బీజేపీ, శివసేన, ఎన్సీపీ మధ్య అనేక చర్చలు జరిగాయి. ఎట్టకేలకు ఆ చర్చలు కొలిక్కి వచ్చాయి. మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేయనుండటం ఇది మూడోసారి. అంతకుముందు ఫడణవీస్ 2014 నుంచి 2019 వరకు సీఎంగా వ్యవహరించారు. 2019లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ- నాటి రాజకీయ పరిస్థితుల కారణంగా 5 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది.