Rahul Gandhi Sambhal Visit : ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల అల్లర్లు జరిగిన సంభల్‌లో బాధితులను పరామర్శించేందుకు బయల్దేరిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ బృందంలో ఎంపీ ప్రియాంకా గాంధీతోపాటు యూపీకి చెందిన మరో ఐదుగురు ఎంపీలు ఉన్నారు. స్థానికేతరుల ప్రవేశంపై ఆంక్షలున్న నేపథ్యంలో ఘాజీపుర్ సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీల వాహనాలను యూపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్ సారథ్యంలోని కాంగ్రెస్ బృందం ఘాజిపుర్ నుంచి దిల్లీకి వెనుదిరిగింది.
అంతకుముందు, తానొక్కడిని అయినా వెళ్లేందుకు సిద్ధమని, అయినా కూడా పోలీసులు అనుమతించడం లేదని రాహుల్ ఆరోపించారు. సంభల్‌లో ఏం జరిగిందో చూడటానికి వెళ్లాలని అనుకున్నట్లు చెప్పారు. బాధితులను కలవాలని వెళ్తుండగా తన రాజ్యాంగ హక్కును కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అంతం చేసే ఘటనలు కొనసాగుతున్నాయని విమర్శించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సంభల్ వెళ్లేందుకు తనకు రాజ్యాంగపరమైన హక్కు ఉందన్నారు రాహుల్ గాంధీ.
కట్టుదిట్టమైన భద్రత
రాహుల్ బృందం పర్యటన నేపథ్యంలో ఈ ఉదయం నుంచే దిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘాజీపుర్ సరిహద్దు వద్ద భారీగా బలగాలను మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు వాహనాల్లో అక్కడికి చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది.
#WATCH | At the Ghazipur border, Lok Sabha LoP Rahul Gandhi says " we are trying to go to sambhal, the police is refusing, they are not allowing us. as lop, it is my right to go, but they are stopping me. i am ready to go alone, i am ready to go with the police, but they did not… pic.twitter.com/iFWMQRKmk3
— ANI (@ANI) December 4, 2024
ఇదీ వివాదం
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో మొగలుల కాలం నాటి మసీదు ఉన్న స్థలంలో ఆలయం ఉందని కొందరు హిందువులు స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు మసీదులో సర్వే జరపాలని ఆదేశాలిచ్చింది. గతనెల 24న మసీదులో రెండోసారి సర్వే జరుగుతున్న సమయంలో అల్లర్లు చెలరేగాయి. స్థానికులు కొందరు పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేయటానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు. మళ్లీ అలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం సంభల్‌లో ఆంక్షలు విధించింది.
VIDEO | LoP Lok Sabha Rahul Gandhi (@RahulGandhi) interacts with police officials at Delhi's Ghazipur border as he was stopped from moving to violence-hit Sambhal.#SambhalViolence #sambhalnews
— Press Trust of India (@PTI_News) December 4, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/K1FIZXvl1p
స్థానికేతరులు రాకుండా 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో సంభల్ జిల్లా అధికారులు గౌతమ్ బుద్ధనగర్, గజియాబాద్, అమ్రోహ, బులంద్‌షహర్ పోలీసులకు లేఖ రాశారు. సరిహద్దుల్లోనే రాహుల్‌ను అడ్డుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ బృందాన్ని ఘాజిపుర్‌లోనే పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సంభల్‌కు స్థానికేతరులెవరూ రావొద్దని జిల్లా కలెక్టర్ ఆంక్షలు విధించారు. ఇటీవల సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని బృందం అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకొని వెనక్కి పంపారు.
VIDEO | Massive traffic jam being witnessed on the Delhi-Meerut Expressway at the Ghazipur border as Congress workers gathered there defying heavy barricading. The police have stopped LoP Lok Sabha Rahul Gandhi, MP Priyanka Gandhi Vadra, who were on their way to violence-hit… pic.twitter.com/7LECD5bxQT
— Press Trust of India (@PTI_News) December 4, 2024
ఉత్తర్‌ప్రదేశ్ అల్లర్లలో నలుగురు మృతి - 30మంది పోలీసులకు గాయాలు
అదానీని వెంటనే అరెస్ట్ చేయాలి - కానీ మోదీ ఉండగా అది జరగదు : రాహుల్ గాంధీ