Credit Cards Seasonal Rewards : క్రెడిట్ కార్డును తీసుకోవడం గొప్పేం కాదు. దాన్ని తెలివిగా వాడుకొని, అవసరాలను తీర్చుకోవడమే గొప్ప విషయం. హాలిడేస్‌లో, సేల్స్ ఈవెంట్స్‌లో వ్యూహాత్మకంగా క్రెడిట్ కార్డును వినియోగిస్తే కొన్ని సీజనల్ రివార్డులు, క్యాష్ బ్యాక్‌లు, లాయల్టీ పాయింట్స్ లభిస్తాయి. వాటిని రిడీమ్ చేసుకొని బాగానే ఆర్థిక ప్రయోజనం పొందొచ్చు. సీజనల్ సేల్స్ జరుగుతున్న సమయాల్లో క్రెడిట్ కార్డ్ ద్వారా ఎలా ప్రయోజనం పొందాలో తెలియాలంటే ఈ కథనం చదవండి.
మీ క్రెడిట్ కార్డు రివార్డ్ ప్రోగ్రాం గురించి తెలుసుకోండి
క్రెడిట్ కార్డు ఉంటే కస్టమర్ కేర్‌కు కాల్ చేసి, మీ కోసం అందుబాటులో ఉన్న రివార్డ్ ప్రోగ్రాం గురించి వివరంగా తెలుసుకోండి. మీకొచ్చే సందేహాలన్నీ వారిని అడగండి. కొన్ని కార్డులు సీజనల్ కొనుగోళ్లపై బాగానే రివార్డులను అందిస్తాయి. ఇంకొన్ని కార్డులు వినోదం, డైనింగ్, గ్రోసరీ,ట్రావెల్ వంటి నిర్దిష్ట కేటగిరీల్లో షాపింగ్ చేస్తేనే రివార్డులను ఇస్తాయి. పలు క్రెడిట్ కార్డులు సీజనల్ సేల్స్ జరుగుతున్న సమయాల్లో అదనపు రివార్డులను అందించే ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇలాంటి వాటిని క్రెడిట్ కార్డుల వినియోగదారులు అందిపుచ్చుకోవచ్చు.
సీజనల్ ప్రమోషన్లు, ఆఫర్లు
మన దేశంలోని క్రెడిట్ కార్డుల కంపెనీలు ఏటా పండుగల టైంలో సీజనల్ రాయితీలను, రివార్డులను ప్రకటిస్తుంటాయి. దీపావళి, నూతన సంవత్సరం, దసరా, క్రిస్మస్ వంటి సందర్భాల్లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఇ-కామర్స్ వేదికలు సీజనల్ సేల్స్‌ను జరుపుతుంటాయి. వీటి ద్వారా కొనుగోళ్లు జరిపితే రాయితీలు, రిబేట్‌లు, బోనస్ పాయింట్ల రూపంలో అదనపు రివార్డులను అందుకోవచ్చు.
రివార్డులు వచ్చే కేటగిరీల్లోనే ఖర్చు
సీజనల్ సేల్స్ జరుగుతున్న సమయాల్లో కొన్ని క్రెడిట్ కార్డులు గ్రోసరీ, వినోదం, డైనింగ్, ట్రావెల్ వంటి విభాగాల్లోనే రివార్డు పాయింట్లను అందిస్తాయి. అలాంటప్పుడు క్రెడిట్ కార్డుతో ఆయా విభాగాల్లోనే సాధ్యమైనంత ఎక్కువగా కొనుగోళ్లు చేయాలి. దీంతో ఎక్కువగా రాయితీలు లభిస్తాయి. రివార్డులు దక్కుతాయి.
క్రెడిట్ కార్డు పార్ట్‌నర్ బ్రాండ్లలో ఆఫర్లు
కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు పలు కంపెనీలు, బ్రాండెడ్ సంస్థలతో కలిసి పనిచేస్తుంటాయి. సీజనల్ సేల్స్ జరిగే టైంలో ఆయా కార్డులతో టై అప్ కలిగిన సంస్థలలో కొనుగోళ్లు చేసినా మనం అదనపు రివార్డులను పొందొచ్చు. ఉదాహరణకు మనం వినియోగించే క్రెడిట్ కార్డుతో ఒక విమానయాన సంస్థకు భాగస్వామ్య ఒప్పందం ఉందని భావిద్దాం. సీజనల్ సేల్స్ సమయంలో మనం ఆ విమానయాన సంస్థ వెబ్‌సైటులోకి వెళ్లి టికెట్ బుక్ చేసుకొని, క్రెడిట్ కార్డుతో చెల్లింపు జరిపితే రాయితీతో పాటు రివార్డులు, లాయల్టీ పాయింట్లు, క్యాష్ బ్యాక్ వంటివి లభిస్తాయి.
బోనస్ రివార్డు పాయింట్లపై గురిపెట్టండి
హాలిడేస్ సమీపించిన వేళ లేదా షాపింగ్ ఈవెంట్స్ జరుగుతున్న సమయంలో మనం అలర్ట్ కావాలి. కొన్ని నిర్దిష్ట కేటగిరీల్లో లావాదేవీలు జరిపితే బోనస్ రివార్డు పాయింట్లను ఇస్తుంటారు. ఆ కేటగిరీలు ఏవో కస్టమర్ కేర్ ద్వారా తెలుసుకోవాలి. ఆయా విభాగాల్లోనే కొనుగోళ్లు జరిపితే ఎక్కువ ప్రయోజనం దక్కుతుంది.
భారీ కొనుగోళ్లకు మాత్రమే
భారీగా కొనుగోళ్లు జరపడానికి మాత్రమే క్రెడిట్ కార్డును వినియోగించండి. మీ క్రెడిట్ కార్డు లావాదేవీ ఎంత ఎక్కువ ఉంటే, అంతమేర రాయితీలు, రివార్డులు దక్కుతాయి. విమాన టికెట్ల బుకింగ్, బస్సు టికెట్ల బుకింగ్, హాలిడే షాపింగ్‌కు కార్డును వాడొచ్చు. అయితే రాయితీ లేదా రివార్డుల ఆఫర్లు నడుస్తున్న సమయంలోనే ఈ విభాగాల్లో షాపింగ్ చేయండి.
ఎక్కువ రివార్డులిచ్చే కార్డునే ఎంపిక
మీ దగ్గరున్న క్రెడిట్ కార్డుతో లావాదేవీలు చేసినా పెద్దగా రివార్డు పాయింట్లు రావడం లేదా ? అయితే ఎక్కువ రివార్డులిచ్చే క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోండి. మీరు ఎక్కువగా ఏ విభాగంలో కొనుగోళ్లు చేస్తారు ? అనే దాని ఆధారంగా కార్డును ఎంపిక చేసుకోండి. ఒకవేళ మీరు గ్రోసరీ షాపింగ్ ఎక్కువ చేస్తే, వాటి ఉత్పత్తులు అందించే కంపెనీతో టై అప్ కలిగిన క్రెడిట్ కార్డు కోసం వెతకండి. డైనింగ్, ఆన్లైన్ షాపింగ్, ఇంధన వినియోగం, ట్రావెల్ ఇలా విభిన్న కేటగిరీలపై రాయితీలిచ్చే విభిన్న క్రెడిట్ కార్డులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
పరిమిత కాలపు ఆఫర్లను గుర్తించండి
సీజన్‌ను బట్టి కొన్ని క్రెడిట్ కార్డులు పరిమిత కాలపు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అవి నిర్దిష్ట గడువులోగా ముగిసిపోతాయి. అయితే ఇలాంటి వాటిలో కొనుగోళ్లు చేయడం వల్ల సాధ్యమైనన్ని ఎక్కువ రివార్డు పాయింట్లను దక్కించుకోవచ్చు. అదనంగా బోనస్ పాయింట్లు, ఫ్రీ గిప్టులు కూడా ఇస్తుంటారు. వీటిని చూసి తొందరపాటుతో షాపింగ్ చేయొద్దు. ఏ సందేహం వచ్చినా కస్టమర్ కేర్ ద్వారా వివరాలు తెలుసుకోండి.
తక్కువ ఫీజ్‌తో ఎక్కువ బెనిఫిట్స్- ఈ టాప్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ గురించి తెలుసా?
మీ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లు త్వరలో ఎక్స్‌పైర్ అవున్నాయా? - ఇలా వాడితే ఫుల్ బెనిఫిట్స్!