How to Make Ulava Karam Podi: వేడి వేడి అన్నంలోకి కొద్దిగా ఉలవచారు పోసుకుని, పైన మీగడ వేసుకుని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే ఆహా అనిపిస్తుంది ఎవరికైనా. అయితే ఉలవలతో కేవలం చారు మాత్రమే కాదు కారప్పొడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా ఈ కారం పొడి, నెయ్యి వేసుకుని తింటే అమృతమే. పైగా ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ కరిగించడం నుంచి షుగర్ కంట్రోల్ చేయడానికి, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. మరి లేట్ చేయకుండా ఈ పొడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- ఉలవలు - 200 గ్రాములు
- మినపప్పు - 2 టీ స్పూన్లు
- శనగపప్పు - 2 టీ స్పూన్లు
- నూనె - సరిపడా
- జీలకర్ర - అర టీస్పూన్
- బ్యాడిగి మిరపకాయలు - 20
- వెల్లుల్లి రెబ్బలు - 5
- ఎండు కొబ్బరి ముక్కలు - పావు కప్పు
- చింతపండు - చిన్న ఉసిరికాయంత
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఉలవలు వేసి వేయించుకోవాలి. ఉలవలు మంచి వాసన వచ్చేవరకు సిమ్‌లోనే నిధానంగా వేయించుకోవాలి.
- ఉలవలు పూర్తిగా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్‌లో మినపప్పు, శనగపప్పు వేసి ఓ రెండు చుక్కల నూనె వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసి కూడా వేయించుకోవాలి.
- ఇలా వేయించుకున్నవాటిని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో టీ స్పూన్ నూనె వేసి బ్యాడిగి మిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఒకవేళ మీరు సాధారణ మిరపకాయలు వాడుతున్నట్లైతే కారానికి సరిపోయే విధంగా వేసుకోవాలి.
- మిరపకాయలు వేగుతున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉలవలు, మిరపకాయల మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
- ఆ తర్వాత వాటిని మిక్సీజార్‌లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు వేసుకోకపోయినా ఈ కారప్పొడి సూపర్‌గా ఉంటుంది. అంతే ఎంతో రుచికరమైన, మరెంతో ఆరోగ్యకరమైన ఉలవల కారప్పొడి రెడీ.
- దీన్ని ఓ గాజు పాత్రలో స్టోర్ చేసుకుని వేడి వేడి అన్నంలోకి నెయ్యితో తింటే అద్దిరిపోతుంది. అంతేకాకుండా ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి టిఫెన్స్లోకి కూడా పర్ఫెక్ట్. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.
టిఫెన్స్లోకి డైలీ చట్నీయేనా బ్రో? - ఈ "నువ్వుల కారం పొడి"ని ట్రై చేయండి - టేస్ట్ అదుర్స్!