UTS App New Update Today : రైల్వే టికెట్ కౌంటర్ దగ్గర క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా జనరల్ టికెట్ కావాలంటే బెస్ట్ ఆప్షన్ యూటీఎస్ (అన్ రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్) మొబైల్ యాప్. దీన్ని రైల్వే శాఖ అధికారికంగా నిర్వహిస్తుంటుంది. జనరల్ టికెట్స్‌ను బుక్ చేసుకోవడానికి ఎంతోమంది రైల్వే ప్రయాణికులు నిత్యం ఈ యాప్‌ను వాడుతుంటారు. కొత్త అప్‌డేట్ ఏమిటంటే ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి కొన్ని జియో ఫెన్సింగ్ పరిమితులు ఉండేవి. తాజాగా వాటిని తొలగిస్తున్నట్లు రైల్వేశాఖ వర్గాలు ప్రకటించాయి.
యూటీఎస్ యాప్ ద్వారా జనరల్ టికెట్ల బుకింగ్‌ను మరింత పెంచే ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు వెల్లడించాయి. ఇంతకుముందు వరకు ఈ యాప్ ద్వారా సబర్బన్ ప్రాంతాల వారు రైల్వే టికెట్ బుక్ చేయడానికి 20 కి.మీ దూర పరిమితి ఉండేది. ఇక నాన్-సబర్బన్ ప్రాంతాలకు చెందిన ప్రజలు టికెట్ బుక్ చేసుకోవడానికి 50 కి.మీ దూర పరిమితి ఉండేది. అంటే అంతలోపు దూరంలో ఉన్న రైల్వే స్టేషన్లకు సంబంధించిన టికెట్లే బుక్ అయ్యేవి.
ఒక కొత్త రూల్
సవరించిన కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు ఈ పరిమితి ఏదీ లేదు. అంటే ఇకపై మనం యూటీఎస్ యాప్ ద్వారా దూరంతో సంబంధం లేకుండా ఏ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన టికెట్‌నైనా బుక్ చేసుకోవచ్చు. అయితే కొత్తగా వచ్చి చేరిన ఒక రూల్‌ను గుర్తుంచుకోవాలి. అదేమిటంటే యూటీఎస్ ద్వారా టికెట్‌ను కొన్న తర్వాత ఒక గంటలోగా ప్రయాణం ప్రారంభించాలి. సమీప రైల్వే స్టేషనుకు ట్రైన్ చేరుకోవడానికి గంట సమయం ఉందనగా మనం టికెట్‌ను బుక్ చేసుకోవాలన్న మాట. ఒకవేళ రైల్వే స్టేషను దగ్గరికి వచ్చి యూటీఎస్ ద్వారా టికెట్‌ను బుక్ చేసుకోవాలని భావిస్తే తప్పకుండా స్టేషన్ నుంచి కనీసం 5 మీటర్ల దూరంలో ఉండాలి. స్టేషనుకు అంత దూరంలో ఉంటేనే యూటీఎస్ యాప్ ద్వారా టికెట్ బుక్ అవుతుంది. యూటీఎస్ యాప్ ద్వారా ప్లాట్ ఫామ్, సీజన్ టికెట్లను కూడా మనం కొనొచ్చు.