Ujjain Mahakal Temple Fire: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయంలో సంప్రదాయ భస్మ హారతి నిర్వహిస్తుండగా అపశ్రుతి జరిగింది. హోలీ సందర్భంగా గర్భగృహంలో ఉదయం 5:50 గంటల సమయంలో భస్మహారతి ఇస్తుండగా కర్పూరంపై రంగులపొడి పడి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో సేవకులు సహా 14 మంది పూజారులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆలయ సిబ్బంది హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అందులో 8 మందిని మెరుగైన చికిత్స కోసం ఇందౌర్‌కు తరలించారు.
దూరంగా ఉండటం వల్లే తప్పిన ప్రమాదం
హోలీని పురస్కరించుకుని ఆలయంలోని గర్భగృహంలో 'భస్మహారతి' నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగిందని ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. సంప్రదాయంలో భాగంగా రంగుల పొడి చల్లుతుండగా కర్పూరంపై పడిందనీ అది నేలపై దొర్లి మంటలు చెలరేగాయని చెప్పారు. ఆలయంలోని సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఘటనపై విచారణ చేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో పలువురు ప్రముఖులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వారంతా దూరంగా ఉండటం వల్ల ప్రమాదం తప్పిందని సమాచారం.
ప్రధాని మోదీ, సీఎం మోహన్ యాదవ్ విచారం
ఉజ్జయినీ ఆలయంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. 'ఇలా జరగడం చాలా బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని స్థానిక యంత్రాంగం క్షతగాత్రులకు అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తోంది' అని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. పూజారుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అధికారులతో మాట్లాడుతున్నట్టు చెప్పారు. ఇందౌర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి కైలాశ్ విజయ్‌తో కలిసి పరామర్శించారు సీఎం. మరోవైపు కేంద్ర హోమ్‌మంత్రి అమిత్ షా ఈ ఘటన గురించి సీఎం మోహన్ యాదవ్‌తో మాట్లాడినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. క్షతగాత్రలకు సాయం చేసేలా అన్ని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.