Tribute To Ramoji Rao In Bhubaneswar : ఒడిశాలో ఇద్దరు యువ కళాకారులు లైవ్‌లో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు పెయింటింగ్ వేసి ఘన నివాళులర్పించారు. భువనేశ్వర్‌లోని జయదేవ్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఈ పెయింటింగ్ వేశారు. ఈ సభకు ఈటీవీ ఒడియాలో పని చేసే ఉద్యోగులతో పాటు ఒడిశా మీడియా ప్రతినిధులు, సిని పరిశ్రమకు చెందిన వారు హాజరై నివాళులర్పించారు. మీడియా ప్రపంచానికి, సినీ పరిశ్రమకు ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. రామోజీరావు చేసిన సేవలను గురించి వివరిస్తూ ఒక ప్రత్యేకమైన వీడియోను ప్రదర్శించారు. రామోజీరావు చేసిన సేవల గురించి వివరిస్తూ ఆయన పేరు మీద ఒక మ్యాగ్జైన్ను విడుదల చేశారు.
సంస్మరణ సభలో సంగీతం కళాకారులతో ప్రదర్శన (ETV Bharat) రామోజీరావు పేరుతో మ్యాగజైన్ విడుదల (ETV bharat) రామోజీరావు ప్రింట్, టెలివిజన్, డిజిటల్, సినిమా, టూరిజం ఇలా అనేక రంగాల్లో తనదైన ముద్రను వేశారని సంస్మరణ సభకు వచ్చినవారు కొనియాడారు. 'గత ఐదు దశాబ్దాల్లో మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకోచ్చారు. ముఖ్యంగా వివిధ ప్రాంతీయ భాషల్లో ఈటీవీ భారత్‌ను ప్రారంభించి దేశంలో అతి పెద్ద నెట్‌వర్క్‌గా స్థాపించగలిగారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిస్తూ మీడియా, సిని రంగాన్ని విస్తరించడంలో రామోజీరావు సూత్రధారి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన రామోజీరావు మళ్లీ పుట్టాలి' అని సభకు వచ్చినవారు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
సంస్మరణ సభకు హజరైన ప్రముఖులు (ETV Bharat) రామోజీరావు సంస్మరణ సభలో నివాళులు (ETV Bharat) రామోజీరావు సంస్మరణ సభ (ETV Bharat) 'రామోజీకి భారతరత్న ఇవ్వాలి'
'ఈటీవీ, ఈనాడు ద్వారా యువత ప్రతిభను వెలికితీసి, ఎంతో మంది ఉపాధికి బాటలు వేసిన మహనీయుడు రామోజీరావు. ఆయన మరణం దేశానికి తీరని లోటు' అని ఒడిశాలోని గంజాం జిల్లా బ్రహ్మపుర ఎమ్మెల్యే కె అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం బ్రహ్మపురలో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే మాట్లాడుతూ రామోజీరావు వేల మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. భారతరత్న ఇవ్వడమే ఆయనకు నిజమైన నివాళి అని అక్కడి తెలుగు సంఘాల సభ్యులు, ప్రముఖులు సభలో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయాలని తీర్మానించారు.
'ఆయన మరణం మీడియా రంగానికే శూన్యం'
ఛత్తీస్‌గఢ్‌లోని రాయపుర్లో మంగళవారం మీడియా ప్రతినిధులు, సినీ పరిశ్రమ కళాకారులు కలిసి రామోజీరావుకు నివాళులర్పించారు. ఛత్తీస్‌గఢ్ ఫిల్మ్ అండ్ విజువల్ ఆర్ట్ సొసైటీ, జర్నలిస్టులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామోజీరావు మరణించడం మీడియా రంగానికే శూన్యంలా ఉందని పేర్కొన్నారు. పాత్రికేయ రంగానికి ఆయన సేవలు ఎప్పటికీ మరిచిపోలేవని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు జర్నలిజం విలువలతో కూడిన గొప్ప వ్యక్తి, ఆయన మాదిరిగానే ఎంతోమంది యువ జర్నలిస్టులను తయారు చేశారని తెలిపారు.