Kejriwal Janta Ki Adalat Today :ఈడీ, సీబీఐని దుర్వినియోగం చేసి ప్రభుత్వాలను పడగొడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై దిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇది సమంజసమా అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను అడుగుతున్నట్లు తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను బీజేపీలోకి చేర్చుకోవడం కూడా సమంజసమా అని ప్రశ్నించారు. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం చేపట్టిన జనతా కీ అదాలత్ కార్యక్రమంలో మోహన్ భగవత్‌కు ఐదు ప్రశ్నలు సంధించారు కేజ్రీ.
ఆర్‌ఎస్‌ఎస్ నుంచి బీజేపీ పుట్టిందని, కానీ ఇప్పుడు ఆ పార్టీ రాజకీయాలతో ఆర్ఎస్ఎస్ వారు సంతృప్తిగా ఉన్నారో లేదో మోహన్ భగవత్ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నానని కేజ్రీవాల్ అన్నారు. నాయకులు 75 ఏళ్లు రాగానే పదవీ విరమణ చేయాలనే నిబంధన బీజేపీలో ఉందని, అది ప్రధాని నరేంద్ర మోదీకి వర్తించదా అని ప్రశ్నించారు. తమ పార్టీకి ఆర్‌ఎస్‌ఎస్ అవసరం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నప్పుడు ఎలా అనిపించిందని భగవత్‌ను అడిగారు. వీటికి సమాధానాలు ఇవ్వాలని కోరారు.
అందుకే రాజీనామా చేశా: కేజ్రీవాల్
అవినీతిలో కూరుకుపోవడానికో లేదా సీఎం కుర్చీలో కూర్చోవడానికో తాను రాజకీయాల్లోకి రాలేదని, అందుకే రాజీనామా చేశానని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలతో తాను బాధపడ్డానని, అందుకే రాజీనామా చేశానని తెలిపారు. జైలు నుంచి సేవ చేసేందుకు మాత్రమే వచ్చానని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో ప్రేమను మాత్రమే సంపాదించుకున్నానని చెప్పారు. అందుకే ప్రజలు తనకు ఉండేందుకు తమ ఇళ్లను అందిస్తున్నారని అన్నారు.
"దసరా నవరాత్రులు ప్రారంభం కాగానే సీఎం నివాసం వదిలి మీ(ప్రజలు) ఇళ్లకు వచ్చి బస చేస్తా. కేజ్రీవాల్‌ను దొంగ అని మీరు అనుకుంటున్నారా? లేదా నన్ను జైలుకు పంపిన వారు దొంగలు అని అనుకుంటున్నారా? రాబోయే దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నాకు అగ్నిపరీక్ష లాంటివి. నేను నిజాయితీ లేనివాడినని మీరు అనుకుంటే నాకు ఓటు వేయకండి."
-- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ మాజీ సీఎం
తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పదేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు దిల్లీలో సొంత ఇల్లు కూడా లేదని కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రధాని మోదీ తనను, మనీష్ సిసోదియాను అవినీతిపరులుగా చూపి, ప్రజలకు దూరం చేయాలని కుట్రపన్నారని ఆరోపించారు. దేశంలో మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మరోవైపు, దిల్లీలో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.