SC on Compassionate Appointment :కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందడం హక్కు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలనే నిబంధన ఏదీ లేదని తెలిపింది. 1997లో మరణించిన ఓ పోలీసు కానిస్టేబుల్ కుమారుడు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ మేరకు పేర్కొంది. అమల్లో ఉన్న విధానానికి, చట్టానికి వ్యతిరేకంగా, ఓ వ్యక్తి లేదా సమూహానికి అనుకూలంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహ్‌సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. సాధారణంగా జరిగే కారుణ్య నియామకం ప్రభుత్వోద్యోగి మరణంతో అతడి కుటుంబం తక్షణ ఆర్థిక ఇబ్బందులకు గురికారాదనే ఉద్దేశంతో జరిగేదే తప్ప సుదీర్ఘ కాలం తర్వాతా పొందే హక్కు కాదని తీర్పు వెలువరించింది.
'కారుణ్య నియామకం హక్కు కాదు - ఉద్యోగం కల్పించాలనే నిబంధన లేదు' - SC ON COMPASSIONATE APPOINTMENT
కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందడం హక్కు కాదని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు - ఉద్యోగం అవకాశం కల్పించాలనే నిబంధన ఏదీ లేదు
Published : Nov 14, 2024, 8:59 AM IST
హరియాణాకు చెందిన పిటిషనర్ టింకూ తండ్రి జై ప్రకాశ్ 1997లో విధుల్లో ఉండగా మరణించారు. ఆ సమయానికి టింకూ వయసు ఏడేళ్లు. ఆమె తల్లి నిరక్షరాస్యురాలు. దీంతో ఆమె కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకోలేదు. అయితే తన కుమారుడి పేరును మైనర్ల జాబితాలో చేర్చాలని అభ్యర్థించారు. తద్వారా మేజర్ అయిన తరవాత అతనికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం వస్తుందని ఆశించారు. ఈ క్రమంలో భవిష్యత్తులో ఉద్యోగావకాశం కల్పించేందుకు వీలుగా 1998లో టింకూ పేరును అప్పటి హరియాణా డీజీపీ నమోదు చేయించారు. తండ్రి మరణించిన 11 ఏళ్లకు 2008లో మేజరైన టింకూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఉద్యోగి మరణించిన మూడేళ్లలోపు కారుణ్యనియామకానికి దరఖాస్తు చేసుకోవాలంటూ 1999లో తీసుకొచ్చిన నిబంధనను అనుసరించి అధికారులు టింకూ అభ్యర్థనను తోసిపుచ్చారు. దీన్ని సవాలు చేసినా టింకుకు కింది కోర్టులు సహా పంజాబ్-హరియాణా హైకోర్టులోనూ వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. తాజాగా సుప్రీం కోర్టు కూడా పూర్వ తీర్పులనే సమర్థించింది. అయితే అతని కుటుంబానికి ఊరట కలిగిస్తూ ఏకమొత్తంలో పరిహారం కోరుతూ సంబంధిత అధికార విభాగానికి విజ్ఞప్తి చేసుకోవడానికి టింకూ తల్లికి అవకాశమిచ్చింది. అలాగే ఆమె అభ్యర్థనపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఆపై జరిగే ఆలస్యానికి వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందని సంబంధిత విభాగానికి సూచించింది.