Sabarimala Special Passes Halted :శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్. అయ్యప్ప దర్శనం కోసం అటవీ మార్గంలో కాలినడకన వెళ్లే భక్తుల కోసం జారీ చేసే ప్రత్యేక పాస్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) తెలిపింది. వర్చువల్ క్యూ సిస్టమ్, స్పాట్ బుకింగ్ ద్వారా పంబా మీదుగా వచ్చే భక్తులు ఎక్కువ సేపు దర్శనం కోసం వేచి ఉండకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు సభ్యుడు ఏ అజికుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అటవీ మార్గంలో భారీగా పెరిగిన భక్తులు
అటవీ మార్గంలో నడిచివెళ్లే 5 వేల మంది భక్తులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేసేందుకు అధికారులు ఇటీవలే ఏర్పాట్లు చేశారు. అయితే అటవీ మార్గం గుండా వచ్చే భక్తుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక పాస్‌ల జారీపై ఆంక్షలు విధించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ప్రత్యేక పాస్‌లు జారీ చేయకూడదని ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) ఓ ప్రకటనలో పేర్కొంది.