Simultaneous Polls High Level Committee Report :'ఒకే దేశం - ఒకే ఎన్నిక' నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచాలని న్యాయ మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం తెలిపాయి. సాధ్యమైనంత త్వరగా కేబినెట్‌కు నివేదికను సమర్పించాలనుకుంటున్నట్లు చెప్పాయి. ఇది న్యాయ మంత్రిత్వ శాఖ లెజిస్లేటివ్ విభాగం 100రోజుల అజెండాలో భాగమే అని వెల్లడించాయి.
లోక్‌సభ ఎన్నికలకు ముందు, తదుపరి ప్రభుత్వం కోసం 100రోజుల అజెండాను రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఆదేశించారు.
రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో గతేడాది ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ, తన నివేదికను మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. అందులో, మొదటి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. అనంతరం 100రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలను సూచించింది. అంతేకాకుండా ఈ సిఫారసుల అమలును పరిశీలించేందుకు ఒక 'అమలు బృందం' నియమించాలని ప్రతిపాదించింది. వనరులను ఆదా చేయడం, అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందించడం, ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బలంగా చేయడం, దేశ ఆకాంక్షలను సాకారం చేయడంలో ఈ జమిలి ఎన్నికలు సహాయపడతాయని కమిటీ నివేదికలో పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపడం కోసం 18 రాజ్యాంగ సవరణలను ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది. అయితే అందులో చాలా వరకు సవరణలకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. ఈ సవరణల్లో కొన్నింటిని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఇక ఒకే ఓటర్ జాబితా, ఒకే ఓటరు ఐడీ కార్డుకు సంబంధించి కమిటీ ప్రతిపాదించిన మార్పులకు కనీసం సగం రాష్ట్రాల ఆమోదం అవసరం.
ఇదిలా ఉండగా జమిలి ఎన్నికల విషయమై లా కమిషన్ కూడా సొంతంగా ఓ నివేదిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు వంటి స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం.