Prisoner Swallows Mobile Phone :కర్ణాటకలోని శివమొగ్గ సెంట్రల్ జైలులో ఉన్న ఓ ఖైదీ మింగేసిన మొబైల్ ఫోన్‌ను వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ప్రస్తుతం ఖైదీ కోలుకుంటున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అతడు ఎప్పుడు, ఎందుకు మొబైల్ ఫోన్‌ను మింగేశాడో అనేది ఇంకా తెలియలేదని పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే?
పరశురామ్ అనే ఖైదీ గత కొన్నాళ్లుగా శివమొగ్గ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గత నెల రోజులుగా జైలులో పరశురామ్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అధికారులు పరశురామ్‌ను వైద్యం కోసం జైలు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. పరశురామ్‌ను పరిశీలించిన ఆయన, శివమొగ్గలోని మెగాన్ ఆస్పత్రికి తరలించమని జైలు అధికారులకు సూచించారు. దీంతో అతడిని మెగాన్ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరశురామ్‌కు పరీక్షలు చేశారు. ఖైదీ కడుపును ఎక్స్ రే తీశారు. ఎక్స్ రేలో ఫలితాల్లో పరశురామ్ కడుపులో ఏం ఉందో స్పష్టంగా వైద్యులకు తెలియలేదు. దీనిపై పరశురామ్‌ను వైద్యులు ప్రశ్నించగా, రాయి ఉందని అతడు సమాధానం చెప్పాడు. అయితే, మెగాన్ ఆస్పత్రిలో ఎండోస్కోపీ సౌకర్యం లేకపోవడం వల్ల పరశురామ్‌ను ఏప్రిల్ 1న బెంగళూరులోని సెంట్రల్ జైలు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు అధికారులు.
బెంగళూరు సైంట్రల్ జైలు సీనియర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఏప్రిల్ 6 వరకు పరశురామ్‌కు చికిత్స అందించారు. ఆ తర్వాత విక్టోరియా ఆస్పత్రికి పరశురామ్‌ను తరలించమని ఆయన సిఫార్సు చేశారు. అక్కడికి తరలించగా ఆస్పత్రి వైద్యులు ఏప్రిల్ 25న పరశురామ్‌కు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి కడుపులో ఉన్న మొబైల్ ఫోన్ తీశారు. అతడి కడుపులో ఫోన్‌ను చూసిన వైద్యులు షాక్ అయ్యారు. ప్రస్తుతం పరశురామ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అతడు కోలుకుంటున్నట్లు జైలు అధికారులు తెలిపారు.