Shashi Tharoor On INDIA Alliance :ప్రస్తుత సార్వత్రిక పోరులో ఇండియా కూటమితో కలిసి పోటీ చేయని పలు పార్టీలు లోక్ సభ ఎన్నికల ఫలితాలు తర్వాత ఏకమవుతాయని కాంగ్రెస్ అగ్రనేత శశిథరూర్ అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఇండియా కూటమి ఈ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఇతరుల మాట వినే ప్రధానిని ప్రజలు పొందొచ్చని అన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు ఇండియా కూటమిలో లేని టీఎంసీ సహా మరికొన్ని పార్టీలు ఏకమవుతాయని జోస్యం చెప్పారు. ప్రముఖ వార్తాసంస్థ పీటీఐ సంపాదకులతో మాటామంతి కార్యకర్యంలో శశిథరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సంకీర్ణ ప్రభుత్వాల్లోనే బాగుంది. ఒకే పార్టీ నేరుగా అధికారంలోకి వచ్చినప్పుడు కన్నా సంకీర్ణ ప్రభుత్వాల్లోనే భారత ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంది. ఈ లోక్ సభ ఎన్నికలు మార్పు కోసం జరుగుతున్నాయి. బీజేపీ ప్రజల్లో పట్టు కోల్పోయింది. అయోధ్య ప్రాణప్రతిష్ఠకు వెళ్లకూడదని పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నా. ఓ గొప్ప కార్యక్రమాన్ని ప్రధాని మోదీని కీర్తించే రాజకీయ వేదికగా మార్చేశారు. అందుకే రామమందిర ప్రారంభానికి వెళ్లకూడదని కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం కరెక్టే. "
-శశిథరూర్, కాంగ్రెస్ అగ్రనేత
సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడితే ప్రధాని పదవి ఎవరు చేపట్టినా నిరంకుశ నిర్ణయాలు ఉండవని, ఇతర పార్టీలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ 26 పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపి మంచి ఫలితాలను సాధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 'మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ఏర్పడిన యూపీఏ-1 సంకీర్ణ ప్రభుత్వంలో దేశ ఆర్థిక వృద్ధి బాగా పెరిగింది. దేశ ప్రజలు సంకీర్ణ ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదు.' అని శశిథరూర్ పేర్కొన్నారు.