Hindenburg On SEBI Chief Issue : సెబీ ఛైర్‌పర్సన్ మాధబి బచ్‌పై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి. దేశంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. హిండెన్‌బెర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును సీబీఐ లేదా సిట్‌కు అప్పగించాలని సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. మరోవైపు, హస్తం పార్టీతోపాటు దాని మిత్రపక్షాలు దేశంలో ఆర్థిక అస్థిరతకు దారితీసేందుకు కుట్ర పన్నాయని బీజేపీ ఆరోపించింది.
సెబీతో కుమ్మక్కు అయ్యే అవకాశం ఉన్నందునే!
సెబీతో కుమ్మక్కు అయ్యే అవకాశం ఉన్నందున అదానీ సంస్థను ఉద్దేశించి హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును సీబీఐ లేదా సిట్‌కు అప్పగించాలని సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. సెబీ ఛైర్‌పర్సన్ పదవికి మాదభి బచ్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. మోదీ, అదానీ కలిసి చేసిన "మోదానీ మెగా స్కామ్"పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని పునరుద్ఘాటించారు.
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై 2 నెలల్లో దర్యాప్తు ముగించాలని గతేడాది ఫిబ్రవరిలో సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు జైరాం రమేశ్. ఇప్పటివరకు కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్‌కు సంబంధించిన రూల్ 19Aని అదానీ సంస్థ ఉల్లంఘించిందా అనే దాన్ని కూడా సెబీ తెలుసుకోలేదని ఆరోపించారు.సెబీ దర్యాప్తు ఆలస్యం వల్ల తన స్నేహితుడి అక్రమ కార్యకలాపాలు బయటపడకుండా ప్రధాని మోదీ, ఎన్నికలను సౌకర్యవంతంగా నావిగేట్ చేశారన్నారు.
అదానీకి సెబీ ఓ కాజీ క్లబ్‌లా!
"మాధవి బచ్‌ను సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమించే సమయంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది? అదానీ ఆఫ్‌షోర్ కంపెనీల్లో ఆమెకు పెట్టబడులు ఉన్నాయని నిజంగానే వారికి తెలియదా? లేక తెలిసే చేశారా? దానికి కూడా కాంగ్రెసే కారణమా? అని హస్తం పార్టీ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. "ఈ మొత్తం వ్యవహారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేకారణం. సెబీ ఛైర్మన్ నియామకం సమయంలో ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే అదానీకి సెబీ ఓ కాజీ క్లబ్‌లా మారిపోయింది" అని పవన్ ఆరోపించారు.
'భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే కుట్ర!'
సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై జేపీసీ విచారణ జరపాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను భారతీయ జనతా పార్టీ తోసిపుచ్చింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచి, దేశంలో పెట్టుబడులను నాశనం చేసే బూటకం లాంటిదని వ్యాఖ్యానించింది. ప్రతిపక్షాల విమర్శలు కుట్రలో భాగంలోనివని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.