SC Guidelines For Demolition Of Properties :ఇటీవల నేరస్థుల ఇళ్ల కూల్చివేతలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కట్టడాల కూల్చివేతకు సంబంధించి పౌరులందరికీ వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు మంగళవారం తెలిపింది. కట్టడాల కూల్చివేతకు ఓ వ్యక్తి నిందితుడు లేదా దోషి అని కారణం కాకూడదని స్పష్టం చేసింది. భారత్ ఒక లౌకిక దేశం అన్న అత్యున్నత న్యాయస్థానం, ఏదో ఒక వర్గానికి కాకుండా పౌరులందరికీ, అన్ని సంస్థల కోసం మార్గదర్శకాలు రూపొందిస్తామని చెప్పింది. ఫలానా మతానికి అంటూ భిన్నమైన చట్టం ఉండదన్న కోర్టు, పబ్లిక్ రోడ్లు, ప్రభుత్వ భూములు, అడవుల్లో ఎలాంటి అనధికార నిర్మాణాలకు తాము రక్షణగా ఉండమని తేల్చి చెప్పింది. అయితే, తమ ఆదేశాలు ఆక్రమణదారులకు సహాయపడకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకు నేరగాళ్ల ఇళ్లపై 'ఆపరేషన్ బుల్డోజర్'ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై, జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
'అలాంటి వారి ఇళ్లను కూల్చడానికి వీలులేదు- దేశం మొత్తం వర్తించేలా త్వరలో గైడ్‌లైన్స్' - SC Guidelines Demolition Properties - SC GUIDELINES DEMOLITION PROPERTIES
SC Guidelines For Demolition Of Properties : కట్టడాల కూల్చివేతలపై దేశవ్యాప్తంగా మార్గదర్శకాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. కేసులో నిందితుడు లేదా దోషిగా ఉన్నంత మాత్రాన వారికి సంబంధించిన నిర్మాణాలను కూల్చివేయలేం అని చెప్పింది. అయితే చట్టవిరుద్ధమైన ఆక్రమణలకు తమ మార్గదర్శకాలు సహాయం చేయకుండా చూసుకుంటామని పేర్కొంది.
Published : Oct 1, 2024, 3:24 PM IST
|Updated : Oct 1, 2024, 3:42 PM IST
అంతకుముందు, సెప్టెంబర్ 17 ఇదే కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు, అక్టోబర్ 1 వరకు తమ అనుమతి లేకుండా నిందితులకు సంబంధించిన నిర్మాణాలతో సహా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని ఆదేశించింది. చట్టవిరుద్ధమైన ఒక్క కూల్చివేత జరిగినా రాజ్యాంగం నైతికతకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. అయితే రోడ్లు, పుట్‌పాత్‌లు, జలాశయాలు, రైలుట్రాక్‌లను ఆక్రమించి కట్టిన ఏ కట్టడాన్ని అయినా తొలగించాల్సిందేనని, అలాంటి కేసులో తమ ఆదేశాలు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇంతకుముగు సుప్రీం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువును పొడగించాలని న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. ఈ విషయంలో తుది తీర్పు వచ్చే వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని సుప్రీం పేర్కొంది.
అసోంకు సుప్రీం నోటీసులు
సెప్టెంబర్ 17న సుప్రీం జారీ చేసిన ఆదేశాలను అసోం ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ ఇటీవల అత్యున్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. దీనిపై మూడు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పింది. ప్రస్తుతానికి అక్కడ కూల్చివేతలను ఆపేయాలని, యథాతథ స్థితి కొనసాగించాలని పేర్కొంది.