Sanjay Singh On BJP: బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని బంగారు జనతా పార్టీ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. దేశం కోసం సేవ చేయడానికి తన ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని కూడా వదిలి పెట్టి వచ్చిన వ్యక్తిని అవినీతిపరుడిగా ప్రశ్నిస్తున్నారని అన్నారు. బుధవారం రాత్రి తిహాడ్ జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆయన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన భార్య సునీతను కలిశారు.
'BJP అంటే 'బంగారు' జనతా పార్టీ- దిల్లీలో ఉచిత నీటి సరఫరా ఆపేందుకే స్కెచ్!' - Sanjay Singh On BJP - SANJAY SINGH ON BJP
Sanjay Singh On BJP : బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని బంగారు జనతా పార్టీ అంటూ విమర్శించారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. బెయిల్‌పై విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇది సంబరాలు చేసుకోవాల్సిన సమయం కాదని, పోరాడే సమయమని తెలిపారు.
Published : Apr 4, 2024, 7:26 AM IST
'2కోట్ల మంది సమాధానం చెబుతారు'
'అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు మా నేతలను జైలుకు పంపించారు. త్వరలోనే వాళ్లు కూడా బయటకు వస్తారు. ఇది సంబరాలు చేసుకోవాల్సిన సమయం కాదు. పోరాడే సమయం' అని సంజయ్ సింగ్ అన్నారు. 'సీఎం భార్యను కలిసినప్పుడు సునీతా కేజ్రీవాల్ కళ్లలో కన్నీళ్లు చూశాను. దిల్లీలోని 2 కోట్ల మంది ప్రజలు అందుకు బీజేపీకి సమాధానం చెబుతారు. ఆప్ నేతలు దిల్లీలో ఉన్న 2 కోట్ల ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించాలని అనుకున్నారు. అందుకే వారు జైలులో ఉన్నారు. ఎప్పటికీ ఆప్ భయపడదు. మేమంతా కేజ్రీవాల్‌తో ఉన్నాం. అవినీతి నేతలందరినీ బీజేపీలోకి చేర్చుకున్నారు' అని సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఉచిత నీరు, విద్యుత్ ఆపేందుకే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తోంది సంజయ్ సింగ్ ఆరోపించారు.
నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన దాదాపు ఆరు నెలల తర్వాత సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు మంగళవారమే బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బుధవారం రాత్రి తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆప్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తిహాడ్ జైలులో గేటు నంబర్ 3 నుంచి బయటకు వచ్చిన సంజయ్ సింగ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, ఆయనపై పూలవర్షం కురిపించారు. మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు.