Sandeshkhali Incident :బంగాల్లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై టీఎంసీ మద్దతుదారులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్సీ కమిషన్ సిఫార్సు చేసింది. గురువారం సందేశ్‌ఖాలీని సందర్శించిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం- అక్కడి మహిళలతో మాట్లాడిన అనంతరం ఈ మేరకు రాష్ట్రపతికి సిఫార్సులు పంపింది. రాష్ట్రంలోని నేరస్థులు ప్రభుత్వంతో చేతులు కలిపారని, సందేశ్‌ఖాలీలో ఉన్న ఆందోళనకర పరిస్థితులు అక్కడి షెడ్యూల్ కులాల ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ అరుణ్ హాల్దర్ పేర్కొన్నారు.
బీజేపీ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు
మరోవైపు, సందేశ్‌ఖాలీ అంశంపై ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సందేశ్‌ఖాలీని సందర్శించేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎంపీలను రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. ఆరుగురు సభ్యుల బీజేపీ బృందాన్ని మార్గమధ్యంలో పోలీసులు అడ్డగించగా- వారు అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. దాంతో బీజేపీ బృందం ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలవడానికి కోల్‌కతాలోని రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.
సెక్షన్ 144 అమలులో ఉన్న నేపథ్యంలో సందేశ్‌ఖాలీకి వెళ్లడం కుదరదని పోలీసులు చెప్పారని కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక్ పేర్కొన్నారు. నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. కేంద్ర మంత్రి, ఎంపీలు ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా వ్యవహరించారని మండిపడ్డారు. నిందితుడు షాజహాన్ షేక్‌ను అరెస్ట్ చేయడంలో పోలీసులు ఈ ఉత్సాహం చూపించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు.
అధిర్ అడ్డగింత
సందేశ్‌ఖాలీకి బయల్దేరిన కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిని సైతం పోలీసులు దారిలోనే అడ్డుకున్నారు. విపక్ష నేతలను అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను అధిర్ ప్రశ్నించారు. సందేశ్‌ఖాలీ అంశం గురించి ఎవరికీ తెలియనీయకుండా బంగాల్ సర్కారు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.