Road Accident In Tamil Nadu Today : తమిళనాడులోని తెన్కాసి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, వీరంతా వాటర్‌ఫాల్స్‌కు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో చనిపోయినవారిని తెన్కాసి జిల్లా పులియంగుడిలోని పులియంగుడికి చెందిన కార్తీక్, మనోజ్, సుబ్రమణి, మనోకరణ్, బోతి రాజ్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా శనివారం సాయంత్రం పులియంగుడిలోని బాలసుబ్రమణ్య సామి ఆలయ ఉత్సవాలకు వెళ్లారు. ఆ తర్వాత కుర్తాళం జలపాతాన్ని సందర్శించారు. అనంతరం తమ స్వగ్రామానికి కారులో తిరిగి బయలుదేరారు. కారు ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయానికి పున్నయ్యపురం సింగిలి పట్టి వద్దకు చేరుకుంది. ఇంతలో సిమెంట్ బస్తాలతో ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆ వ్యక్తి మరణించాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్ష నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చుని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.