Rameswaram Cafe Blast Suspect : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటన దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కేఫ్ సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాల ఆధారంగా అనుమానితుడి కదలికలను గుర్తించారు. అందులో ఆ వ్యక్తి ఒక బ్యాగ్‌ను కెఫేలోకి తీసుకెళ్లిన దృశ్యాలు ఉన్నట్లు పోలీసుల తెలిపారు. అనుమానితుడు ముఖానికి మాస్క్, కళ్లద్దాలు, క్యాప్ ధరించి బ్యాగ్‌ను తీసుకెళ్లినట్లు సీసీటీవీలో రికార్డైందని చెప్పారు. అదే వ్యక్తి కెఫేలో ఇడ్లీ తిని బ్యాగ్‌ను వదిలివెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.
పేలుడుకు ముందు, ఆ తర్వాత నిందితుడు వైట్ ఫీల్డ్‌లోని మారత్ గ్రామ ప్రాంతంలో తిరిగినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అనుమానితుడితో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ పేలుడుపై దర్యాప్తు జరిపేందుకు 8 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు 2022 నవంబర్‌లో జరిగిన మంగళూరు కుక్కర్ పేలుడు మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయమో అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.
హోంశాఖ అధికారులతో సమావేశం
మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం మధ్యాహ్నం హోంశాఖ సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు. ఈ ఘటన వెనకు ఉన్నది ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ మోహన్, బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ సహా సీనియర్ పోలీసు అధికారులు హాజరుకానున్నారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక, పేలుడుకు వినియోగించిన పదార్థాలు, గాయపడిన వారికి చికిత్స అందించడం వంటి విషయాలను చర్చించనున్నారు.