Puri Jagannath Temple 4 Doors Open : ఒడిశాలో మోహన్ చరణ మాఝి నేతృత్వంలో తొలిసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం మొదటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా గురువారం ఉదయం పూరీలోని జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలను తెరిపించింది. అనంతరం సీఎం మోహన్ చరణ మాఝితోపాటు కేబినెట్ మంత్రులంతా జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్నారు.
అయితే ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలో ఆలయ నాలుగు ద్వారాలను ఐదేళ్ల తర్వాత అధికారులు తెరిచారు. అన్ని ద్వారాల గుండా భక్తులు ఆలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆలయ నాలుగు ద్వారాలు తెరవడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. కొత్త ముఖ్యమంత్రి మెహన్ చరణ నిర్ణయాన్ని భక్తులతోపాటు ఆలయ సేవకులు స్వాగతించారు.
"కేబినెట్ తొలి సమావేశంలో జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలను తెరవాలని నిర్ణయించాం. ఉదయం 6:30 గంటలకు నాతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంగళ హారతికి హాజరయ్యాం. జగన్నాథ దేవాలయ అభివృద్ధికి సంబంధించి బడ్జెట్లో రూ.500 కోట్ల కార్పస్ ఫండ్‌ను కేటాయిస్తాం."
-మోహన్ చరణ మాఝి, ఒడిశా సీఎం
ఎన్నికల అస్త్రంగా!
2020 మార్చిలో కొవిడ్ ఆంక్షలతో అప్పటి బీజేడీ ప్రభుత్వం ఆలయంలో ద్వారాలను మూసివేసింది. కేవలం సింహద్వారం నుంచే భక్తులను అనుమతించింది. ఆ తర్వాత కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన ద్వారాలను తెరవలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చినా బీజేడీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ అంశాన్ని బీజేపీ ఎన్నికల అస్త్రంగా తీసుకుని ప్రచారం చేసింది
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆలయ నాలుగు తలుపులు తెరుస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత బీజేపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. ఒడిశా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోహన్ మాఝి ఆలయ నాలుగు ద్వారాలను భక్తుల కోసం తెరవాలని ఆదేశించారు. అనంతరం గురువారం నాలుగు ద్వారాలను భక్తుల కోసం తెరిచారు. అయితే భక్తుల సౌకర్యార్థం షూ స్టాండ్‌లు, తాగునీటి వసతి, వర్షం నుంచి రక్షణ కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వర్షాకాల సమావేశాల్లోనే కేంద్ర బడ్జెట్- నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్! - parliament session
'ఎన్నికల్లో ఆశించిన మేర రాణించలేదు- ఆత్మపరిశీలన చేసుకుంటున్నాం' - sitaram yechury interview