Priyanka Gandhi Lok Sabha Contestant :ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. దీంతో వయనాడ్ (కేరళ), రాయ్ బరేలీ (ఉత్తర్ ప్రదేశ్) నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానాన్ని రాహుల్ వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ సీటును వదులుకోవాలనుకునే విషయంపై తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నానని రాహుల్ ఇటీవల వ్యాఖ్యానించారు. కాగా, తన నిర్ణయం రెండు నియోజకవర్గాల ప్రజలను సంతోషపరుస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ వయనాడ్ స్థానాన్ని వదులుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వయనాడ్ నుంచే ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఉపఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
ఏ సీటును వదులుకోవాలనే విషయంపై రాహుల్ గాంధీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే వయనాడ్ స్థానం ఖాళీ కావొచ్చని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె. సుధాకరన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ' 'ఇండియా' కూటమికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ వయనాడ్‌కే పరిమితం కావాలని మేం అనుకోవట్లేదు. అందుకే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటాం. రాహుల్ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటాం.' అని సుధాకరన్ తెలిపారు. ఈ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ వయనాడ్ స్థానాన్ని వదులకుని కాంగ్రెస్ కంచుకోట ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతారని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.