Pakistan Ceasefire Violation : పాకిస్థాన్ మరోసారి భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు శత్రువులకు దిటుగా బదులిచ్చింది. ఈ ఘటనలో దాయాది సైన్యం వైపు భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో బుధవారం రాత్రి అనూహ్యంగా పాక్ సైన్యం కాల్పులకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి తార్కుండి ప్రాంతంలో ఉన్న భారత ఫార్వర్డ్ పోస్ట్‌పై పాక్ రేంజర్లు కాల్పులు జరిపాయి. ప్రశాతంగా ఉన్న సమయంలో పాక్ వైపు నుంచి కాల్పులు జరగడం వల్ల భారత సైన్యం పొరుగుదేశంపై విరుచుకుపడింది. పాక్ రేంజర్లపై తూటాల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో పాక్ సైన్యం వైపు భారీగానే ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం. మృతుల సంఖ్య వివరాలు స్పష్టంగా తెలియలేదు. అయితే, ఈ సమాచారాన్ని భారత సైన్యం ఇంకా ధ్రువీకరించలేదు.
కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి ఈ ఏడాదిలో జరిగిన ఇదే తొలి ఘటన. గత కొన్ని రోజులుగా వివిధ మార్గాల్లో పాకిస్థాన్ కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. ఫిబ్రవరి 4, 5 తేదీల మధ్య అర్థరాత్రి కొందరు చొరబాటుదారులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, భారత సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఏడుగురు హతమవ్వగా, వారిలో కొందరు పాక్ భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 8న రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడికి గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం భారత సైన్యానికి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఒకరు ల్యాండ్‌మైన్‌పై అనుకోకుండా అడుగు పెట్టి స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన అధికారిని సైనిక ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
వారం రోజులుగా సరిహద్దు వెంబడి శత్రుదేశ కార్యకలాపాలు పెరగడం వల్ల నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10న జమ్ముకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్, లెఫ్టినెంట్ జనరల్ నవీన్ సచ్దేవా, రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులను సమీక్షించారు. నియంత్రణ రేఖ వెంబడి అప్రమత్తంగా ఉంటూ శత్రువులపై కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.