PM Kisan Samman Nidhi Yojana : పీఎం కిసాన్ 17వ విడత నిధుల్ని మంగళవారం(జూన్ 18) వారణాసి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20వేల కోట్లు జమ అయ్యాయి. అలాగే పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పని చేసేందుకు శిక్షణ పొందిన 30వేల మందికిపైగా స్వయం సహాయ బృందాల మహిళలకు సర్టిఫికెట్లను ప్రధాని మోదీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
'గంగమ్మ తల్లి నన్ను ఒడిలోకి తీసుకుంది'
వారణాసి ప్రజలు తనను మూడోసారి ఎంపీగా మాత్రమే కాకుండా ప్రధానిగా కూడా ఎన్నుకున్నారని మోదీ వ్యాఖ్యానించారు. గంగమ్మ తల్లి తనను ఒడిలోకి తీసుకుందని, తానూ వారణాసిలో భాగమయ్యానని పేర్కొన్నారు. కాశీ విశ్వనాథుడు, గంగమ్మ తల్లి, కాశీ ప్రజల ప్రేమతో తాను దేశానికి మూడో సారి ప్రధాని అయ్యాయని తెలిపారు. 'ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడుసార్లు ఎన్నికైన ప్రభుత్వాలు చాలా అరుదు. కానీ భారత ప్రజలు వరుసగా మాకు మూడోసారి అధికారం ఇచ్చారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అపూర్వమైనది. చరిత్ర సృష్టించింది. ఈ శతాబ్దంలో దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చడంలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది.' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
పీఎం కిసాన్ నిధుల విడుదలకు వారణాసికి వచ్చిన ప్రధాని మోదీని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సత్కరించారు. "ఇంత మెజారిటీతో మూడోసారి ప్రధాన మంత్రి కావడం సాధారణ విషయం కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పు అపూర్వమైనది. రైతులందరి తరపున నేను ప్రధాని మోదీని స్వాగతిస్తున్నాను. వ్యవసాయం దేశానికి ఆత్మ. రైతులకు సేవ చేయడం అంటే భగవంతుని ఆరాధనే అని బీజేపీ నమ్ముతుంది. ప్రధాని అయిన తర్వాత మోదీ మొదటి సంతకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిపైనే చేశారు' అని శివరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.
పీఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు హాజరు అయ్యారు. దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, లక్షకుపైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలతో సహా 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ గంగా హారతిలో పాల్గొన్నారు. అలాగే కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని పూజలు చేశారు.