PM Modi Meet With NDA CM's :దేశాభివృద్ధికి, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు చండీగఢ్‌లో ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా 17 రాష్ట్రాల సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
'దేశాభివృద్ధికి మా కూటమి కట్టుబడి ఉంది'- NDA సీఎంల సమావేశంలో ప్రధాని మోదీ - PM MODI MEET WITH NDA CMS
ముగిసిన ఎన్డీయే సీఎంల కౌన్సిల్ మీటింగ్- దేశాభివృద్ధికి 'ఎన్డీఏ' కట్టుబడి ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ
Published : Oct 17, 2024, 10:02 PM IST
|Updated : Oct 17, 2024, 10:44 PM IST
ఈ సమావేశం అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు. పరిపాలన ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారని చెప్పారు. ప్రో-పీపుల్, ప్రో- గవర్నెన్స్ (పీ2జీ2) పాలనపై దృష్టిసారించాలని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లమన్నారని తెలిపారు. "ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు చెందిన 17 మంది సీఎంలు, 18 మందిడి ప్యూటీ సీఎంలు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో 6 ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించారు. ప్రధాని విధానాల కారణంగా హరియాణాలో పార్టీ విజయంపై మొదటి ప్రతిపాదనను మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే చేశారు. దానికి ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025లో 'సంవిధాన్ కా అమృత్ మహోత్సవ్' జరుపుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరో ప్రతిపాదనను ప్రతిపాదించారు." అని నడ్డా తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లో తొలిసారి భారత రాజ్యాంగం!
"దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌లో భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారోత్సవం (బుధవారం ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారన్ని ఉద్దేశించి) జరగడం ఇదే మొదటిసారి అని ప్రధాని తన పరిశీలనలో తెలిపారు. స్వావలంబన బాటలో భారత్ ఎలా పురోగమిస్తుందో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. డిజిటల్ ఇండియాలో దేశం ఎలా పురోగమిస్తుందో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ చర్చించారు. భారత్ 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ గురించి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడారు. అంతేకాకుండా, ఆయా రాష్ట్రాల్లో 'ఏక్ పెద్ మా కే నామ్(అమ్మ పేరు మీద ఒక మొక్క)'ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు." అని జేపీ నడ్డా వివరించారు.