PM Modi Warning To Pakistan :చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని దాయాది దేశాన్ని మరోసారి గట్టిగా హెచ్చరించారు. కార్గిల్ 25వ విజయ దివస్‌ను పురస్కరించుకుని ద్రాస్‌లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం ఆనాటి యుద్ధంలో అమరులు అయిన కుటుంబాలతో ప్రధాని ముచ్చటించారు. తర్వాత షిన్‌కున్ లా సొరంగ పనుల ప్రాజక్టును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మన బలానికి, సహనానికి, వాస్తవాలకు ఈ విజయగాథ నిదర్శమన్నారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారని ప్రధాని అన్నారు. శాంతి కోసం భారత్ తపిస్తే పాకిస్థాన్ తన నిజ స్వభావాన్ని చూపిందని దుయ్యబట్టారు. కార్గిల్‌లో యుద్ధం మాత్రమే గెలవలేదని భారత్ సత్తా, సామర్థ్యాన్ని చాటామని చెప్పారు.
"ఈరోజు గొప్ప భూమి అయిన లద్దాఖ్ కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవానికి సాక్షిగా నిలుస్తుంది. పాకిస్థాన్ గతంలో చేసిన అన్ని వికృత ప్రయత్నాల్లోనూ విఫలమైంది. కానీ, చరిత్ర నుంచి పాకిస్థాన్ ఏమీ నేర్చుకోలేదు. ఉగ్రవాదం, ప్రత్యక్ష యుద్ధం సాయంతో నిలదొక్కుకోవడానికి చూస్తోంది. ఈ ఉగ్రవాద పోషకులకు వారి దుర్మార్గపు చర్యలు ఎప్పటికీ ఫలించవని నేను చెప్పాలనుకుంటున్నాను. మన సైనికులు తీవ్రవాదాన్ని పూర్తి శక్తితో అణిచివేస్తారు. శత్రువులకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి