PM Modi Play Video Games :సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ గేమర్స్‌తో సరదాగా ముచ్చటించారు. దిల్లీలోని తన నివాసంలో గేమర్స్‌తో మాట్లాడిన ప్రధాని, గేమింగ్ రంగంలో ఉండే అవకాశాలు, యువత ఆకాంక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వారితో కలిసి గేమ్స్ ఆడే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీకి నమో ఓపీ అనే గేమింగ్ ట్యాగ్‌ను ఇచ్చారు.
ప్రధాని మోదీతో మాట్లాడుతుంటే తమ కుటుంబసభ్యుల్లాగే అనిపించిందని ఓ గేమర్ తెలిపారు. దేశంలో బిగ్గెస్ట్ ఇన్ ఫ్లూయెన్సర్ ప్రధాని నరేంద్ర మోదీయేనని మరో గేమర్ అభిప్రాయపడ్డారు. అనంతరం ప్రధాని మోదీతో గేమర్స్ ఫొటోలు దిగి ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. ప్రధాని మోదీని అనిమేశ్ అగర్వాల్, నమన్ మాథుర్, మిథిలేశ్ పాటంకర్, పాయల్ టరే, తీర్థ్ మెహతా, గణేశ్ గంగాధర్, అన్షు బిష్ఠ్ అనే ఏడుగురు గేమర్స్ కలిశారు. ఈ క్రమంలోనే గేమింగ్ పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ కొంతమంది అగ్రశ్రేణి భారతీయ గేమర్‌లతో సంభాషించారని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ తెలిపారు. ఈ మేరకు ప్రధాని గేమర్స్‌తో ముచ్చటించిన వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
'ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే హతమార్చాం'
బలమైన బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులను వారి సొంతగడ్డపైనే దేశ భద్రత బలగాలు హతమార్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గతంలో బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వాలు సరిహద్దుల్లోని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో దేశ సరిహద్దుల్లో రోడ్లు, సొరంగాలు నిర్మిస్తున్నామని తెలిపారు. అవినీతిపరులను దేశాన్ని దోచుకోకుండా తాను అడ్డుకున్నానని మోదీ అన్నారు. అందుకే అవినీతిపరులకు తనపై కోపం ఉందని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
"దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలు చూశారు. అందుకే 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' నినాదం దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. దేశంలో బలహీనమైన, అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడల్లా శత్రువులు ప్రయోజనం పొందారు. ఉగ్రవాదం వ్యాప్తి చెందింది. కానీ బలమైన మోదీ ప్రభుత్వంలో దేశ భద్రతా బలగాలు పొరుగు దేశ ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయి. 7 దశాబ్దాల తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ చట్టం, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఒకే ర్యాంక్-ఒకే పెన్షన్ అమలు వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి ఉంది. "
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని