PM Modi Kashmir :2019లో 370 అధికరణ రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో నూతన శిఖరాలను తాకి, స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి ప్రధాని మోదీ కశ్మీర్‌లో పర్యటించారు. కేంద్ర పాలిత ప్రాంతంలో వ్యవసాయ రంగం పుంజుకోవడానికి దోహదం చేసే 5వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. అధికరణ 370పై చాలా కాలంపాటు జమ్ముకశ్మీర్ ప్రజలనే కాదు దేశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుదారి పట్టించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. వికసిత భారత్‌కు వికసిత జమ్ముకశ్మీర్ ప్రాధాన్యమని తెలిపారు. జమ్ముకశ్మీర్ దేశానికి కిరీటమని ప్రశంసించారు.
"కొన్ని దశాబ్దాలపాటు రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, దాని మిత్రులు అధికరణ 370 పేరుతో జమ్ముకశ్మీర్ ప్రజలను మభ్యపెట్టారు. అధికరణ 370 వల్ల ఉపయోగం జమ్ముకశ్మీర్‌కా లేదా కొన్ని రాజకీయ కుటుంబాలకా? కొన్ని రాజకీయ కుటుంబాలే ప్రయోజనం పొందాయి. జమ్ముకశ్మీర్ ప్రజలు ఈ వాస్తవాన్ని గ్రహించారు. కొన్ని కుటుంబాల ప్రయోజనం కోసం సంకేళ్లతో బంధించారు. ఇప్పుడు అధికరణ 370 లేదు. అందువల్ల జమ్ముకశ్మీర్ యువత ప్రతిభకు గుర్తింపు లభిస్తోంది. వారికి కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. అందరికీ సమాన అధికారాలు, అవకాశాలు లభిస్తున్నాయి."
-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'యాదృచ్చికమా లేక ప్రకృతి సంకేతమా?'
'భవిష్యత్తులో జమ్ముకశ్మీర్ విజయగాథ ప్రపంచానికి కేంద్రంగా నిలుస్తుంది. జమ్ముకశ్మీర్‌లోని సరస్సుల్లో ఎక్కడ చూసినా కమలం కనిపిస్తుంది. జమ్ముకశ్మీర్ క్రికెట్ లోగోపై కూడా కమలం గుర్తు ఉంది. బీజేపీ గుర్తు కూడా కమలమే. జమ్ముకశ్మీర్‌కు కమలంతో లోతైన అనుబంధం ఉండడం యాదృచ్చికమా లేక ప్రకృతి సంకేతమా?' అని మోదీ ప్రశ్నించారు.