Modi Grameen Bharat Mahotsav : దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని, అటువంటి గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దిల్లీలో నిర్వహించిన 'గ్రామీణ భారత మహోత్సవం 2025' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. వెనకబడిన వర్గాలైన ఓబీసీ, ఎస్టీ, ఎస్సీలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, అందుకే గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువయ్యాయని అన్నారు. దీనితో సహజంగానే పట్టణాల్లోనూ పేదరికం పెరిగిపోయిందని వాపోయారు. సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నా గ్రామాలకు, పట్టణాలకు మధ్య ఉన్న అంతరం పెరుగుతూనే ఉందని ప్రధాని ఆవేదన వ్యక్తంచేశారు.
మా పాలన సూపర్!
దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు ప్రస్తుతం తమ పాలనలో సమాన హక్కులు పొందుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. సమాజ సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పాటిస్తున్న విధానాలు గ్రామీణ భారతంలో కొత్త శక్తిని నింపుతున్నాయని ప్రధాని చెప్పారు. మారుమూల గ్రామాల ప్రజలను దేశ అభివృద్ధిలో భాగం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి సమ్మిళిత ఆర్థిక విధానాలు అవసరమని ప్రధాని పేర్కొన్నారు.