Pinarayi Vijayan Attack On Congress : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. దిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదట ఆరోపణలు చేసింది కాంగ్రెస్ అని తెలిపారు. మద్యం కుంభకోణం విషయంలో ఫిర్యాదు చేయడం సహా, కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడానికి కాంగ్రెస్ మార్గం సుగమం చేసిందని మండిపడ్డారు. అంతేకాకుండా దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోదియా అరెస్ట్ అయినప్పుడు, కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది కూడా కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు.
దిల్లీలో ఆదివారం జరిగిన బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలిరావడం బీజేపీకి బలమైన హెచ్చరిక అన్న విజయన్, ఈ సభ నుంచి కాంగ్రెస్ కూడా గుణపాఠం నేర్చుకోవాలని చురకలు అంటించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్సేతర పార్టీలపై విమర్శలు చేసేముందు తమ వైఖరి ఏంటో ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీకి హితవు పలికారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా విపక్ష ఇండియా కూటమి ఐక్యతను చాటుతూ దిల్లీలో ఆదివారం బహిరంగ సభ నిర్వహించిన మరుసటి రోజే విజయన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
"కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని వారే (కాంగ్రెస్) అడిగారు. తర్వాత వారి వైఖరి మార్చుకున్నారు. అది స్వాగతించవలసిన విషయమే. కానీ కాంగ్రెస్ నాయకత్వం తమ తప్పును గుర్తించాలి. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటోంది. బీజేపీ చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా మనందరం కలిసి నిలబడాల్సిన అవసరం ఉంది."
-- పినరయి విజయన్, కేరళ ముఖ్యంత్రి
త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థులు పలు నియోజకవర్గాల్లో ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు. దీంతో తమ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ విజయన్ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్‌పై విజయన్ మండిపడడానికి మరో కారణం, సహకార బ్యాంకు కుంభకోణం సహా రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వివిధ ఆరోపణలపై కేంద్ర సంస్థల ద్వారా విచారణ జరిపించాలని యూడీఎఫ్ డిమాండ్ చేయడమే.