How To Make Pesarapappu Charu in Telugu :కొంతమందికి అన్నంలోకి ఎన్ని కూరలు ఉన్నా సరే.. చారు లేకపోతే కడుపునిండా భోజనం చేసిన ఫీల్ ఉండదు. అయితే, చాలా మంది తరచుగా టమాట చారు(Tomato Charu), పచ్చి పులుసు, సాంబార్ వంటివి ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, ఎప్పుడూ ఒకే రుచితో తింటే ఏం బాగుంటుంది. అందుకే ఈసారి మీకోసం 'పెసరపప్పు చారు' తీసుకొచ్చాం. దీన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. పైగా టేస్ట్ కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది! అలాగే దీని కోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. అన్నంతో తినడమే కాదు.. తాగేస్తారు కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం నోరూరించే వేడివేడి పెసరపప్పు చారు తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- పెసరపప్పు - ఒక కప్పు(180 గ్రాములు)
- నూనె - 2 టీ స్పూన్లు
- పసుపు - పావు టీస్పూన్
- వాటర్ - తగినన్ని
- కరివేపాకు - కొద్దిగా
- పచ్చిమిర్చి - టేస్ట్‌కి సరిపడా
- ఉల్లిపాయ - 1
- టమాటలు - 3
- చింతపండు రసం - కొంచెం
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తాలింపు కోసం :
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 5
- ఆవాలు - అర టీస్పూన్
- ఎండుమిర్చి - 3
- ఇంగువ - పావు టీస్పూన్
- కరివేపాకు - కొద్దిగా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో పెసరపప్పును తీసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి.
- ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో రెండు నుంచి రెండున్నర కప్పుల వాటర్ పోసుకోవాలి. ఆపై అందులోనే పసుపు, ఆయిల్ వేసుకోవాలి.
- తర్వాత కుక్కర్ మూత పెట్టి రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి.
- ఆలోపు రెసిపీలోకి కావాల్సిన పచ్చిమిర్చిని మీడియం సైజ్‌లో కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, టమాటాలను సన్నగా తరుక్కోవాలి.
- కుక్కర్ మూడు విజిల్స్ వచ్చాక అందులోని ఫ్రెజర్ పోయాక.. మూత తీసి ఉడికిన పప్పును గరిటెతో మాష్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఆ మిశ్రమంలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాట ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పెసరపప్పు తీసుకున్న కప్పుతో.. 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. అయితే, మీకు పప్పు కాస్త పలుచగా ఉండాలంటే ఇంకొంచెం నీరు యాడ్ చేసుకోవచ్చు.
- అలాగే మీ టేస్ట్‌కి సరిపడా చింతపండు రసం, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పును మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కుక్కర్‌ను స్టౌపై పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. అంటే.. అందులో వేసిన ఉల్లి, టమాటా, పచ్చిమిర్చి సాఫ్ట్‌గా అయి పప్పు మరిగితే సరిపోతుంది.
- అయితే, చారు మగ్గేటప్పుడు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతుండాలి. లేదంటే పప్పు అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఆవిధంగా పప్పును మరిగించుకున్నాక దింపుకొని తాలింపు పెట్టుకోవాలి.
- ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కొంచం ఫ్రై చేసుకోవాలి. ఆపై అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
- అనంతరం తాలింపును తీసుకొని పెసరపప్పు మిశ్రమంలో వేసుకోవాలి. చివరగా కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరమైన 'పెసరపప్పు చారు' రెడీ!
ఇవీ చదవండి :
చిటికెలో ఘుమఘుమలాడే "వెల్లుల్లి చారు" - సింపుల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ నెక్స్ట్ లెవల్ అంతే!
అద్దిరిపోయే టమాటా రసం నిమిషాల్లో సిద్ధం - అన్నంలోకే కాదు సూప్‌లా తాగేయొచ్చు!