కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2024-25 ఆర్థిక సంవత్సారానికిగాను దేశ వాస్తవ జీడీపీ 6.5-7 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. బడ్జెట్ 2024-25లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. దాదాపు 11 దశల్లో దీనిపై చర్చలు జరిగాయని పేర్కొన్నారు. ముఖ్యంగా 63 నేరాలను డీక్రిమినలైజేషన్ చేయడం వల్ల ప్రస్తుతం కంపెనీలు సమర్థంగా కొనసాగుతున్నాయని ఆమె అన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు- ఆర్థిక సర్వే 2023-24ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ - PARLIAMENT BUDGET SESSION 2024 - PARLIAMENT BUDGET SESSION 2024
Published : Jul 22, 2024, 10:02 AM IST
|Updated : Jul 22, 2024, 12:46 PM IST
Parliament Budget Session 2024 Live Updates :కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ సర్కారు తొలిసారి బడ్జెట్‌ను సమర్పించేందుకు పార్లమెంటు సోమవారం సమావేశం అయింది. ఈ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. సోమవారం పార్లమెంట్లో కేంద్రం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనుంది. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ మిగిలిన 8 నెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో 6 బిల్లులను సభ ఆమోదం కోసం కేంద్రం తీసుకురానుంది. మరోవైపు, నీట్ పేపర్ లీకేజీ, కావడి యాత్ర వివాదాలపై కేంద్రాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమయ్యాయి.
LIVE FEED
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2023-24 లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సర్వే వివరాలను వెల్లడిస్తున్నారు.
ధనికులుగా ఉంటే పరీక్ష పేపర్లు కొనవచ్చు! : రాహుల్ గాంధీ
చాలామందికి ధనికులుగా ఉంటే పరీక్ష పేపర్లు కొనవచ్చనే అభిప్రాయం ఉంది అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దీనికి సమాధానమిస్తూ కేంద్రమంత్రి ధర్మేద్ర ప్రధాన్ తమ ప్రభుత్వం పరీక్ష పేపర్లు లీక్ కాకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాజకీయాల కోసమే నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. అనంతరం పరీక్షల పారదర్శక నిర్వహణ అత్యంత కీలక అంశం అని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆ తర్వాత నీట్ పరీక్ష లీకేజీ ఘటనపై సభలో విపక్షాల నినాదాలు చేశాయి. ఈ లీకేజీ అంశంపై చర్చించాలని విపక్షాల పట్టు పట్టాయి.
- నీట్ పరీక్ష లీకేజీ ఘటనపై లోక్‌సభలో విపక్షాల నినాదాలు
- నీట్ పరీక్ష లీకేజీ అంశంపై చర్చించాలని విపక్షాల పట్టు
- విపక్ష సభ్యుల నినాదాల మధ్యే కొనసాగుతున్న లోక్‌సభ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దివంగత వియత్నాం నాయకుడు గుయెన్ ఫు ట్రోంగ్(80)కు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. బంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన శత్రుఘ్న సిన్హా లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ్యులు ప్రశ్నలు అడుగుతున్నారు.
ఇది అమృత కాలానికి చెందిన బడ్జెట్ : ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రస్తుత బడ్జెట్‌ను అమృత్ కాలానికి చెందిన బడ్జెట్‌గా మోదీ అభివర్ణించారు. 2047 నాటికి వికసిత్ భారత్ పూర్తి చేసే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటు ముందుకెళ్తున్నామని, తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని తెలిపారు. సభలో మాట్లాడేందుకు వివిధ పార్టీల నుంచి వచ్చిన సభ్యులకు అవకాశం వస్తుందన్న ప్రధాని, ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలని, తర్వాతే వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు.